mlc kaushik reddy's sensational comments: కరీంనగర్ జిల్లా వీణవంకలో ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ జెండా మోసిన వాళ్లకే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని కార్యకర్తలను ఉత్సాహపరిచారు. ఎమ్మెల్సీ పాడికౌశిక్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. పెద్దపల్లిలో సోమవారం ముఖ్యమంత్రి పర్యటన నేపధ్యంలో జనసమీకరణ కోసం వీణవంకలో తెరాస ముఖ్య కార్యకర్తల సమావేశంలో జరిగింది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి.. తెరాస పార్టీ కండువా కప్పుకొని జెండాలు మోసిన వారికే ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ముందుగా అందుతాయని ప్రకటించారు. త్వరలో కేసీఆర్ ఇండ్లు కట్టుకోవడానికి 3 లక్షలు ఇవ్వనున్నారని.. ఆ డబ్బు కేవలం తెరాస కార్యకర్తలకు ఇస్తారన్నారు. ఎమ్మెల్సీ చేసిన ఈ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. లబ్ధిదారుల ఎంపికలో గ్రామసర్పంచ్, పార్టీ అధ్యక్షులు ఇచ్చే లిస్టే ఫైనల్ అవుతుందని స్పష్టం చేయడం కూడా సంచలనంగా మారింది.
2 నెలల లోపల కేసీఆర్ సొంత జాగాలో ఇళ్లు కట్టుకునేవారికి 3లక్షల రూపాయలు ఇవ్వనున్నారు. టీఆర్ఎస్ జెండా మోసిన వ్యక్తికే ఈ నిధులు అందుతాయి. వేరేవారికి ఇచ్చే ప్రసక్తే లేదు. ఆ జాబితా కూడా నేను డిసైడ్ చేయను. మీ ఊరిలో ఉన్న మన టీఆర్ఎస్ నాయకుడు ఇచ్చిన లిస్ట్‌లో ఉన్న పేర్లే ఫైనల్- పాడి కౌశిక్‌రెడ్డి, ఎమ్మెల్సీ