కరీంనగర్ జిల్లాలో గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు దిగువ మానేరు జలాశయంలో క్రమంగా నీటిమట్టం పెరుగుతోంది. తిమ్మాపూర్ మండలంలోని దిగువ మానేరు జలాశయం పూర్తి సామర్థ్యం 24 టీఎంసీలు కాగా... ఈరోజు ఉదయానికి 21 టీఎంసీలకు చేరింది. జలాశయం గేట్లు ఎత్తుతున్నారనే సమాచారంతో గురువారం మానేరు తీరంలో పర్యాటకుల సందడి నెలకొంది. ఏడాది నుంచి పూర్తిస్థాయిలో నిండని జలాశయం ఒకేసారి నిండుకుండలా మారడంతో పర్యాటకుల తాకిడి పెరిగింది.
వర్షాల ప్రారంభంలో మోయ తుమ్మెద వాగు నుంచి ఎల్ఎంఎండీకి 60 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా... కొంత తగ్గుముఖం పట్టటం వల్ల 2 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతోంది. రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురవగా... ఇన్ఫ్లో 30 వేల క్యూసెక్కులకు పెరిగింది. జలాశయం నీటిమట్టం క్రమంగా పెరగ్గా... ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గేట్ల ద్వారా నీటిని విడుదల చేసే ఆలోచనలో అధికారులు ఉన్నట్లు సమాచారం.