ఐటీ పరిశ్రమ హైదరాబాద్‌కే పరిమితం కాకుండా... ద్వితీయ శ్రేణి నగరాలకు కూడా విస్తరించాలన్న కేటీఆర్ కల సాకారం కాబోతుందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్‌లో నిర్మించిన ఐటీ టవర్‌ను ఈ నెల 21న మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. ఈ మేరకు టవర్ నిర్మాణ పనులు, ఏర్పాట్లు... అధికారులతో కలిసి గంగుల పరిశీలించారు. ఇక్కడ 3 వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్టు తెలిపారు.
ఐటీ టవర్ నిర్మాణానికి కరీంనగర్ దిగువ మానేరు జలాశయం పరిధిలో 2018 జనవరి 8న మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఆ వెంటనే పనులు మొదలు పెట్టేందుకు రూ.34కోట్లు మంజూరు చేశారు. ఫ్లగ్ అండ్ ప్లే పద్ధతిలో పనులు పూర్తి చేశారు. సుమారు 62 వేల చదరపు అడుగుల విస్తీర్ణం గల స్థలం... కంపెనీలకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఈ టవర్‌లో షిఫ్ట్‌కు 1100 నుంచి 1200 మంది సిబ్బంది పనిచేసే అవకాశం ఉంటుందని మంత్రి చెప్పారు.
గ్రౌండ్‌ఫ్లోర్‌లో స్థానిక యువత కోసం లెర్నింగ్ సెంటర్‌తోపాటు ఏసీ, నాన్‌ఏసీ క్యాంటీన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ టవర్‌లో సెంట్రల్ ఏసీతోపాటు, 24 గంటల విద్యుత్ సదుపాయం కల్పించేందుకు అవసరమైన జనరేటర్ అందుబాటులో ఉంచుతున్నారు. ఇప్పటికే పలు ఐటీ కంపెనీలు టవర్‌లో తమ కార్యకలాపాలు ప్రారంభించడానికి ముందుకొచ్చినట్టు మంత్రి తెలిపారు. రూ. 20కోట్ల రూపాయలతో టూల్ డిజైన్ ఎక్స్‌టెన్షన్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నారు.
ఇదీ చూడండి: డిసెంబరు కల్లా కొవిడ్-19 వ్యాక్సిన్!