ప్రకృతి వైపరిత్యాల్లో అన్నదాత అవస్థలను పత్రికల్లో చూసి చలించిపోయే వాడు.. అలాంటి వార్తలతో ఓ పుస్తకాన్ని రూపొందించుకున్నాడు. ఆయా సమస్యలకు చక్కని పరిష్కారం చూపించాలనుకున్నాడు. నిరంతరం అధ్యయనం చేశాడు.. ఎట్టకేలకు సరికొత్త ఆవిష్కరణతో ముందుకొచ్చాడు కరీంనగర్‌కు చెందిన కుంచాల శ్రీనివాస్. పాత సెల్‌ఫోన్ల పరికరాల సహాయంతో 'అగ్రి రమ్య ఇన్నోవేషన్' పేరిట ఓ పరికరాన్ని రూపొందించాడు.
ఇది ఎలా పని చేస్తుంది..
తాను తయారుచేసిన పరికరాన్ని రైతు అమర్చుకొంటే కల్లాల్లో ఆరబెట్టిన పంటను కంటికి రెప్పలా కాపాడుతుందని తెలిపాడు. వర్ష సూచనను ముందే పసిగట్టి.. మానవ ప్రయత్నం లేకుండానే కల్లంపై అమర్చిన పైకప్పు తెరుచుకుంటుందని.. ఎండ అవసరమైనప్పుడు పైకప్పు తొలగిపోతుందని శ్రీనివాస్ పేర్కొన్నాడు. గాలి తీవ్రత ఎక్కువగా ఉన్న సమయాల్లోనూ అప్రమత్తంగా వ్యవహరిస్తుందని తెలిపాడు.
సౌరకాంతితో ఈ పరికరం పనిచేస్తుందని శ్రీనివాస్ తెలిపాడు. ఇందులో సర్క్యూట్ ఎంతో ముఖ్యమైనదని వివరించాడు. ఈ పరికరానికి సెల్‌ఫోన్ అనుసంధానం చేస్తే నిరంతరం అప్రమత్తత సందేశాలు పంపిస్తుందని తెలిపాడు. ఈ పరికరాన్ని లేజర్ కిరణాలు ఏర్పాటు చేసుకుంటే... ఎటువంటి జంతు సంచారం ఉన్న పెద్ద శబ్దంతో రైతులను అప్రమత్తం చేస్తుందని వివరించాడు. ఆర్థిక స్తోమత లేకున్నా.. ఎంతో కష్టించి ఈ పరికరాన్ని రూపొందించినట్లు కుంచాల శ్రీనివాస్ పేర్కొన్నాడు. ఇందుకు విశ్రాంత ఉపాధ్యాయుడు వేణుశ్రీ ఎంతో సహకరించారని తెలిపాడు. దీని రూపకల్పనకు రూ. 8 వేలు వ్యయమైందని.. ప్రభుత్వం సహకరిస్తే మరింత తక్కువకే అందిస్తానని విశ్వాసం వ్యక్తం చేశాడు శ్రీనివాస్.
రైతులకు మేలు చేకూర్చే ఈ ఆవిష్కరణను ప్రదర్శనలో ఉంచేందుకు అధికారులు ఏర్పాటుచేస్తున్నారు. దీన్ని వినియోగించుకుంటే రైతులకు మేలు జరుగుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఇవీచూడండి: మూన్నాళ్ల ముచ్చటగానే తుమ్మిళ్ల ఎత్తిపోతల.. మరమ్మతుల ఊసేత్తని సర్కార్