Godavari flood victims wait for Govt Help: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గోదావరి జలప్రళయం తీరని నష్టాన్నిమిగిల్చింది. ఊహించని విధంగా తమ ఇళ్లు, దుకాణాల్లోకి చొచ్చుకు వచ్చిన నీరు తమను నిలువ నీడలేకుండా చేసిందనే ఆవేదన ధర్మపురి, మంథని వాసుల్లో వ్యక్తమయ్యింది. కడెం ప్రాజెక్టు ఉపద్రవం ఇలా ఉంటుందని తాము ఏనాడు ఊహించుకోలేదని.. అధికారులు కూడా అంచనా వేయకపోవడంతో తాము కట్టుబట్టలతో బజార్లో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
గోదావరి వరద ఉద్ధృతి తగ్గి రెండు నెలలు గడిచినా... ఆ గాయాలు మాత్రం మానలేదు. ధర్మపురిలో తెనుగువాడ, గంపలవాడ, గోలివాడ, బ్రాహ్మణవాడ, బోయవాడ నీటమునిగాయి. నిత్యావసర సరుకులు, గృహోపకరణ వస్తువులు కొట్టుకుపోయాయి. వేలాది రూపాయల విలువ చేసే ఎలక్ట్రానిక్ వస్తువులు నీట మునిగి... పనికి రాకుండా పోయాయి. గోదావరి ఒడ్డున మంగలిఘాట్ వద్ద చిరు వ్యాపారుల వస్తువులు కొట్టుకపోవడంతో... లక్షల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లింది. రెండు నెలలు గడిచిన సర్కార్ నుంచి ఏమాత్రం సాయం లభించలేదని బాధితులు వాపోతున్నారు.
స్వచ్ఛంద సంస్థలు, మున్సిపల్, రెవెన్యూ అధికారులు సహాయక చర్యలు చేపట్టినా ఆర్ధికంగా మాత్రం కోలుకోలేని దెబ్బ తగిలిందని చిరువ్యాపారులు కన్నీటి పర్యంతమయ్యారు. 300 ఇళ్లకుపైగా దెబ్బతినగా... 36 ఇళ్లు పూర్తిగా శిథిలమయ్యాయి. నది తీరాన కొబ్బరికాయలు, ఇతర వ్యాపారాలు నిర్వహిస్తున్న వారికి చెందిన 100 షెడ్లు ధ్వంసమై వరదల్లో కొట్టుకుపోయాయి. తమను ఆదుకోవాలంటూ ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోలేదని బాధితులు వాపోయారు. అధికారులకు ఆధారాలు సమర్పించినా ప్రయోజనం లేకుండా పోయిందంటున్నారు. స్వచ్ఛంద సంస్థలు కొంతమేర స్పందించాయే తప్ప అధికారులు మాత్రం పరిహారం అందించలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్కార్ ఇచ్చే తృణమో పణమో అందించాలని బాధితులు కోరుతున్నారు.
ఇవీ చదవండి: