దళారుల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు పెద్దపెల్లి జిల్లా అధికార యంత్రాంగం చర్యలకు ఉపక్రమించింది. కౌలు రైతుకు చెందిన పత్తి కొనుగోళ్లను బుధవారం నుంచి నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. విషయం తెలియక బుధవారం ఉదయం సీసీఐ కొనుగోలు కేంద్రానికి వచ్చిన పత్తి తీసుకొచ్చిన కౌలు రైతులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో.. గత కొంతకాలంగా దళారులే పత్తిని విక్రయిస్తున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది. ఫలితంగా అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ బుధవారం నుంచి తాత్కాలికంగా కొనుగోళ్లు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.
మిల్లు వద్దే నిరీక్షణ..
బుధవారం ఉదయం సీసీఐ కొనుగోలు కేంద్రానికి పెద్ద మొత్తంలో పత్తిని అమ్మకానికి తీసుకువచ్చారు రైతులు. కానీ అక్కడి వ్యాపారులు, అధికారులు పత్తి కొనుగోలు చేసేందుకు నిరాకరించారు. బుధవారం సాయంత్రం వరకు కౌలు రైతులు కొనుగోలు కేంద్రాల వద్దే నిరీక్షించారు.
అదనపు కలెక్టర్ వివరణ
ఈ విషయమై అధికారుల వివరణ కోరగా.. దళారుల నుంచి కౌలురైతులను రక్షించేందుకు కొనుగోళ్లు నిలిపివేశామని తెలిపారు. మరో వారం పదిరోజుల్లో కొనుగోళ్లు తిరిగి ప్రారంభిస్తామని అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ తెలిపారు. కౌలు రైతులకు న్యాయం చేస్తామని.. ఎవరు ఆందోళన చెందవద్దని విజ్ఞప్తి చేశారు.
ఇవీ చూడండి: ఈనాడు కథనానికి 'స్పందన'.. వృద్ధురాలికి స్వేచ్ఛ