occupied double bedroom houses: పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపాలిటీ పరిధిలో పోచమ్మ వాడ ప్రాంతంలో ప్రభుత్వం నిరుపేదల కోసం 96 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించింది. గత నాలుగు సంవత్సరాల క్రితమే లబ్ధిదారులను ఎంపిక చేసింది. ఇళ్ల నిర్మాణం ఏడాదిన్నర క్రితమే పూర్తయింది. అయినప్పటి నుంచి లబ్ధిదారులు ఇళ్లు ఎప్పుడు ఇస్తారో అని ఎన్నో ఆశలతో ఎదురుచూస్తూ ఉన్నారు. మంగళవారం అర్ధరాత్రి సమయంలో రెండు పడక గదుల ఇళ్ల తాళాలు తీసుకుని ప్రజలు ఆక్రమించుకున్నారు.
తాళాలు పగులగొట్టి...
కొంత మంది తాళాలు పగులగొట్టి మరీ ఇళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయం పట్టణంలో దావానంలా వ్యాపించడంతో మరి కొందరు లబ్ధిదారులు అక్కడికి చేరుకుని ఏడుస్తూ మేము అసలైన లబ్ధిదారులమని, మాకు రాలేదని వాపోవడం వారి వంతయింది. మరికొందరు గొడవలకు దిగారు.
మూడున్నర గంటల తర్వాత పోలీసులు రంగ ప్రవేశం చేసి వారికి సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా వారు వినలేదు. వివాదం మరింత ముదరడంతో మంథని తహసీల్దార్ అక్కడికి చేరుకొని అందరినీ ఖాళీ చేయిస్తూ ఇళ్లకు తాళాలు వేయడంతో... కొంతమంది మహిళలు ఇళ్ల ముందు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
'ఏవరైనా న్యాయంగా రెండు పడక గదుల ఇళ్లు భూమి లేని వారికి, ఇళ్లు లేని వాళ్లకి ఇవ్వాలి. కానీ అవన్నీ అన్ని ఉన్నవాళ్లకే మరల డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తే ఏమి లేని పేదవాళ్లు ఎటుపోతారు. ముగ్గురు పిల్లలతో ఇప్పుడు ఎక్కడ కిరాయికి ఉంటాము. ఉరి పెట్టుకునే పరిస్థితులు ఉన్నాయి. జనాలు పిచ్చి వాళ్లై గెలిపించారా? ఉద్యోగం ఉన్నవాళ్లకు ఇవ్వకపోయినా పర్వాలేదు. నిరుపేదలకు న్యాయం చేయండి. ఇళ్లు ఇస్తరని ఆశతో ఎదురుచూస్తున్నాం. ఇప్పుడు ఇల్లు విడిచి పోతామా, ఊరు విడిచి పోతామా ఎన్ని రోజులైనా ఇక్కడే ఉంటాం. మాలాంటి వాళ్లకు న్యాయం చేయండి. తల్లిదండ్రులు, అత్తవాళ్ల ఆస్తులూ లేవు.వీటి కోసం లంచం పెట్టే శక్తి కూడా లేదు.'
-లబ్ధిదారులు
'అర్హులైన నిరుపేదలకు కచ్చితంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పంపిణీ చేస్తాం. ఇంకా రెండు పడక గదుల నిర్మాణ పనులు పూర్తి కాలేదు. కరెంటు, నీటి సదుపాయాలు ఇంకా అసంపూర్తిగానే ఉన్నాయి. సంబంధిత కాంట్రాక్టర్ ప్రభుత్వానికి ఇళ్లను అప్పగించలేదు. నిర్మించిన 92 ఇళ్ల జాబితాపై అభ్యంతరాలు వ్యక్తం చేయడం వలనే ఇళ్ల పంపిణీ ఆలస్యం అయ్యిందని.. ఎంత సర్ది చెప్పినా వినడం లేదు.'
-బండి ప్రకాష్ తహసీల్ధార్, మంథని
అసలు ఇళ్లను ఆక్రమించుకున్న వారికి తాళాలు ఏవిధంగా వచ్చాయో ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే మిగిలిపోయింది.
ఇదీ చదవండి:Flexi issue in trs: పెద్దపల్లి జిల్లాలో ఫ్లెక్సీ వివాదం... చివరకు ఏమైందంటే..