లాక్‌డౌన్ సమయంలో ప్రభుత్వం అత్యవసర సేవలకు సంబంధించి 108, 102, 196 వాహనాలకు మినహాయింపు ఇచ్చింది. మరోవైపు పల్లెల్లో ఒక గ్రామం నుంచి మరొక ఊరుకు ఎవరూ రావద్దని గ్రామస్థులు, ప్రజాప్రతినిధులు రెండు రోజులుగా గ్రామాల మధ్య రోడ్లను ముళ్లకంచెలు, కర్రలు, ట్రాక్టర్లు పెట్టి దిగ్బంధం చేశారు. దీంతో 108, 102, 196 వెళ్లాలంటే వీటిని తొలగించాల్సి వస్తుంది. దీనివల్ల గ్రామానికి చేరుకునేసరికి ఆలస్యమై రోగులు ఇబ్బంది పడుతున్నారు.
గురువారం కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం గంగిపల్లికి చెందిన కనకం సుకన్య అనే గర్భిణి పురిటి నొప్పులతో 108 వాహనానికి సమాచారం ఇచ్చారు. వీణవంక మండలానికి సేవలందించే 108 వాహనం ప్రస్తుతం మానకొండూర్ మండలం వారికి సేవలందిస్తుండటంతో వెంటనే వీణవంక నుంచి 108 సిబ్బంది బయలుదేరారు. రహదారుల దిగ్బంధంతో వీణవంక, రెడ్డిపల్లి, బొంతుపల్లి, గన్ముకుల బొంతుపల్లి, ఎలబాల, గంగారం మీదుగా గంగిపల్లి చేరుకోవడానికి నానా అవస్థలు పడ్డారు.
ఎక్కడికక్కడ ఏర్పాటు చేసిన అడ్డులను తొలగించుకుంటూ వెళ్లాల్సి రావడంతో సుమారు 60 నిమిషాల వరకు ఆలస్యం అయిందని సిబ్బంది పేర్కొన్నారు. చివరకు సదరు గర్భిణిని కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. కరోనా కట్టడికి స్వీయ నిర్బంధం పాటించాలి గాని ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటుతో అత్యవసర సమయంలో ఇబ్బందులు పడక తప్పడంలేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఇవీ చూడండి:కరోనా పంజా: 17 మరణాలు- 724 కేసులు