ATTACK: ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం ప్రెస్‌క్లబ్ ఆవరణలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మీడియా సమావేశం ఏర్పాటు చేసిన భాజపా నేతలపై వైకాపా వర్గీయులు కర్రలతో దాడి చేశారు. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. భాజపా నేతలు ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే రక్తం కళ్లజూశారు. మూడు వాహనాల్లో వచ్చిన వైకాపా శ్రేణులు.. విచక్షణారహితంగా దాడి చేసి పరారయ్యారు. ధర్మవరం పట్టణ భాజపా అధ్యక్షుడు రాజు, ఆ పార్టీ కార్యదర్శి రాము సహా మరికొందరికి గాయాలయ్యాయి. వారిని పోలీసులు ధర్మవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స తర్వాత అనంతపురం తీసుకెళ్లారు.
ధర్మవరం ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశానికి సన్నద్ధమవుతుండగా.. వైకాపా కార్యకర్తలు, స్థానిక నేతలు ఒక్కసారిగా దాడి చేసినట్లు భాజపా నాయకులు చెప్పారు. నిన్న నియోజకవర్గ ప్లీనరీ సందర్భంగా ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి చేసిన వ్యాఖ్యలే ఈ దాడికి కారణమని వారు ఆరోపిస్తున్నారు. మరోవైపు దాడికి పాల్పడ్డవారిని పట్టుకోవడానికి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పట్టణం దాటి వెళ్లకుండా చెక్‌పోస్టులను అలర్ట్ చేశారు.
ఇవీ చదవండి: