చనిపోయిన వ్యక్తి (వైఎస్సార్) గురించి మాట్లాడే ముందు తెలంగాణ మంత్రులు ఆత్మ పరిశీలన చేసుకోవాలని షర్మిల పార్టీ అడ్‌హక్ కమిటీ సభ్యురాలు ఇందిరా శోభన్ అన్నారు. హైదరాబాద్ లోటస్ పాండ్‌లోని పార్టీ కార్యాలయంలో ఆమె మాట్లాడారు. తెలంగాణ వచ్చిన తర్వాత పాలమూరు జిల్లా రైతుల నోట్లో మట్టి కొట్టింది మీరేనని రాష్ట్ర మంత్రులనుద్దేశించి ఆరోపించారు.
వైఎస్‌ను గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారు..
మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విజన్‌తోనే దక్షిణ తెలంగాణ సస్యశ్యామలం అయిందని ఇందిరా శోభన్ అన్నారు. వైఎస్ మరణాంతరం తెలంగాణలో 700 మంది గుండె పగిలి చనిపోయారని గుర్తుచేశారు. వైఎస్‌ను ఇక్కడి ప్రజలు గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారని ఇందిరా శోభన్ తెలిపారు.
స్థాయి చూసుకుని మాట్లాడండి..
వైఎస్ హయాంలో మీ స్థాయి ఏంటో చూసుకుని మాట్లాడాలని ఇందిరా శోభన్ హితవు పలికారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఉద్యమనాయకుడిగా ఉండి కోట్ల రూపాయలు ఎలా సంపాదించారో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. పువ్వాడ అజయ్‌కుమార్ ఏ బడి నుంచి వచ్చారో తెలుసుకుని మాట్లాడాలని పేర్కొన్నారు. వైఎస్సార్ రాజనీతిజ్ఞుడని.. విద్యాసాగర్ రావు గతంలో చెప్పారని గుర్తు చేశారు. రాష్ట్రంలో తమ పార్టీని దెబ్బతీసే కుట్ర జరుగుతుందని ఇందిరా శోభన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: 'మత్తు' వదలరా.. మకిలీ పట్టకురా..