నేటి పాలకులకు దళితుల సంక్షేమంపై చిత్తశుద్ధిలేదని వైఎస్ షర్మిల ఆరోపించారు. దళితులను ముఖ్యమంత్రి చేయాలని ఎవరూ అడుగక ముందే.. కేసీఆరే స్వయంగా అణగారిన వర్గాల వారిని సీఎం చేస్తానని చెప్పి.. ఎస్సీ, ఎస్టీలను మోసం చేశారని షర్మిల ధ్వజమెత్తారు. అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని తన కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. అంబేడ్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన షర్మిల నివాళులర్పించారు.
మూడెకరాల భూమి, రిజర్వేషన్ పెంపు, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, పింఛన్లు ఇలా ఎన్నో హామీలిచ్చి నెరవేర్చకుండా ఎస్సీ, ఎస్టీలను కేసీఆర్ మోసం చేశారని షర్మిల దుయ్యబట్టారు. రాజయ్య మీద ఒక్క ఆరోపణ రాగానే పదవి నుంచి తప్పించిన కేసీఆర్...మల్లారెడ్డిపై ఆరోపణలు వస్తే మాత్రం ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. దళితులపై కేసీఆర్ ప్రేమకు ఇదే నిదర్శనమన్నారు.
ప్రాణహిత-చేవేళ్ల ప్రాజెక్టు వ్యయాన్ని రూ.లక్ష కోట్లకు పెంచి కేసీఆర్ అవినీతికి పాల్పడుతున్నారని షర్మిల ఆరోపించారు. అంబేడ్కర్ పేరుతో ఉన్న ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును రీడిజైన్ పేరుతో తొలగించారని విమర్శించారు.
ఇవీ చూడండి: ఇందిరాపార్క్ వద్ద షర్మిల దీక్షకు అనుమతి