ఏపీలోని గుంటూరు జిల్లా వీవీఐటి కళాశాలలో యువజనోత్సవాలు ఉత్సాహంగా సాగుతున్నాయి. విద్యార్థుల్లో దాగిఉన్న ప్రతిభను వెలికితీసి.. వారిని వివిధ రంగాల్లో ప్రోత్సహించడానికి ఏటా 2 రోజుల పాటు వీటిని నిర్వహిస్తారు. వేడుకలకు రాష్ట్రంలోని వివిధ ఇంజినీరింగ్ కళాశాలల నుంచి వందలాదిగా విద్యార్థులు తరలివచ్చారు.
మొదటిరోజు కార్యక్రమాలు సందడిగా సాగాయి. కళాశాలలో ఎటుచూసినా విద్యార్థుల హడావుడి కనిపించింది. చిన్ననాటి జ్ఞాపకాల్లోకి మళ్లీ వెళదాం అనే నేపథ్యంతో ఉత్సవాలు సాగుతున్నాయి. ఎక్కడ చూసినా డిస్నీ ల్యాండ్ బొమ్మలు కనిపించాయి. రకరకాల గేమ్ షో లతో విద్యార్థులు స్టాళ్లను ఏర్పాటు చేశారు. సెల్ఫీలు దిగుతూ స్టాళ్లలో కలియతిరుగుతూ... యువత సందడి చేశారు. గ్రామీణ నేపథ్యంతో కూడిన సెట్లు ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఎప్పుడూ చదువులతో తీరిక లేకుండా ఉండే తమకు.. ఇలాంటి కార్యక్రమాలు కొత్త ఉత్సాహాన్ని ఇస్తున్నాయని యువత సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమలో అంతర్గతంగా ఉండే నైపుణ్యాలను బయటకు తీసేందుకు ఈ వేడుకలు ఎంతో ఉపకరించాయని విద్యార్థులు చెబుతున్నారు. జీవితంలో చదువు ఒక్కటే భాగం కాదన్న వీవీఐటి కళాశాల ఛైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్... ఇలాంటి వేడుకల వల్ల విద్యార్థుల్లో ఉండే ఒత్తిడి తగ్గుతుందని అభిప్రాయపడ్డారు.
ఇవీచూడండి: అదిరిందయ్యా మరియప్పన్.. మెప్పిస్తోంది 'లైబ్రరీ సెలూన్'!