Rice Purchase in Telangana : యాసంగి బియ్యం ఇచ్చేందుకు ఈ నెలాఖరుతో ముగియనున్న గడువును కేంద్రం మార్చి 31వ తేదీ వరకు పొడిగించింది. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ లేఖకు కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ, వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వశాఖ స్పందించింది. 2020-21 యాసంగి సీజనులో 92.34 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఆ వడ్ల నుంచి 62.52 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం వస్తాయి. ఈ బాధ్యతను ప్రభుత్వం మిల్లర్లకు అప్పజెప్పింది. అందులో 44.75 లక్షల మెట్రిక్ టన్నులు ఉప్పుడు బియ్యంగా.. మిగిలినవి సాధారణ బియ్యంగా ఇవ్వాలని కేంద్రం కోరిన విషయం తెలిసిందే.
గడువు పొడిగింపు..
Rabi Paddy procurement : ఇప్పటి వరకు మొత్తం 48.17 లక్షల మెట్రిక్ టన్నుల వరకు బియ్యాన్ని ఎఫ్‌సీఐకి మిల్లర్లు అందజేశారు. మిగిలినవి ఇవ్వాల్సి ఉంది. ఉప్పుడు బియ్యంలో ఇంకా నాలుగున్నర లక్షల మెట్రిక్ టన్నులు అప్పగించాలి. ఈ నెలాఖరులోగా ఇవ్వటం సాధ్యం కాదని గుర్తించిన అధికారులు గడువు పొడిగింపు కోరారు.
ఆ తర్వాత తీసుకునేదే లేదు..
Yasangi Paddy Procurement : మార్చి 31వ తేదీ తరవాత బియ్యం తీసుకునేది లేదని కేంద్రం స్పష్టం చేసింది. రీ సైకిల్డ్ బియ్యం ఎఫ్‌సీఐకి ఇవ్వకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలంది. తాజాగా మిల్లింగ్ చేసిన బియ్యమా? పాతవా? అని కలర్ టెస్ట్ ద్వారా నిర్ధారించిన తరవాతే తీసుకోవాలని మంత్రిత్వ శాఖ ఎఫ్‌సీఐ అధికారులకు స్పష్టం చేసింది. మిల్లర్ల వద్ద ధాన్యం ఉందా? లేదా? అని తెలుసుకునేందుకు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించాలని పేర్కొంది. పరిశీలనలో గుర్తించిన ధాన్యాన్ని మాత్రమే కేంద్ర కోటా బియ్యం(సెంట్రల్ పూల్ రైస్)గా గుర్తించి వాటిని మాత్రమే తీసుకుంటామని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. నెలకు సగటున ఆరున్నర లక్షల మెట్రిక్ టన్నులకు మించి బియ్యం ఎఫ్‌సీఐకి ఇచ్చే అవకాశం లేదు. గడువు 40 రోజుల కన్నా తక్కువగానే ఉంది. ఈ లోగా మొత్తం ఇవ్వటం ఎంత వరకు సాధ్యం అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉంది.