Balaji Temple At kovvada: పట్టిసీమ పేరు చెప్పగానే వీరభద్రస్వామి ఆలయమే గుర్తొస్తుంది. కొవ్వూరు నుంచి పోలవరం వరకూ పవిత్ర గోదావరి తీరాన వేంకటేశ్వరస్వామి ఆలయం లేకపోవడం గురించి స్థానికుల మధ్య తరచూ చర్చ వచ్చేది. పాత పట్టిసీమ యువకులు కొవ్వాడ కాలువ గట్టు దగ్గర ఆంజనేయస్వామి విగ్రహం నిర్మించాలనుకున్నారు. అదే విషయాన్ని గ్రామస్థులతో చర్చించారు. వేంకటేశ్వరస్వామి ఆలయమూ నిర్మిస్తే బావుంటుందని మహిళలు సూచిస్తే... ‘అది చాలా ఖర్చు, శ్రమతో కూడిన పని మావల్ల కాదు. మీరు చేయగలరేమో చూడండి’ అన్నారు యువకులు. దీన్నో అవకాశంగా భావించారు గ్రామానికి చెందిన నిద్యోగి రామలక్ష్మి, పూడి అనంతలక్ష్మి, కొల్లు కుమారి.
వీరు ముగ్గురూ సహా 13 మంది బృందంగా ఏర్పడ్డారు. వీళ్లలో ఒకరిద్దరు తప్పించి మిగతావాళ్లంతా వ్యవసాయ కూలీలే. ఎవరికీ సెంటు భూమి కూడా లేదు. ఇంట్లో పిల్లలు, వృద్ధులైన అత్తమామలు, తల్లిదండ్రులకు ఏలోటూ లేకుండా చూసుకోవాలి. మరోవైపు కూలి పనులకూ వెళ్లాలి. అయినా సిద్ధపడ్డారు. కుటుంబ సభ్యులూ ప్రోత్సహించారు. కొవ్వాడ కాలువ గట్టు సమీపాన నీటిపారుదల శాఖకు చెందిన స్థలంలో ఆలయం నిర్మించాలనుకున్నారు. అక్కడున్న ప్రశాంతమైన వాతావరణమే అందుకు కారణమని చెప్పడంతో అధికారులూ అంగీకరించారు.
కొవిడ్ కష్టకాలంలోనూ...
2018 డిసెంబరు 15న ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆరోజు నుంచి ఇంటి పనులూ, పొలం పనులూ చేసుకుంటూనే సాయంత్రాలు ఒక ఆటోలో విరాళాల సేకరణకు వెళ్లేవారు. తాడేపల్లిగూడెం, రాజమహేంద్రవరం, పోలవరం, కొవ్వూరు సహా... ఉభయ గోదావరి జిల్లాల్లో అనేక గ్రామాలూ, పట్టణాలు తిరిగి విరాళాలు సేకరించారు. రూ.వెయ్యి నుంచి 25 వేల వరకూ చందాలు ఇచ్చిన వాళ్లున్నారు. ఇసుక తీసుకువెళ్లే ట్రాక్టర్ల డ్రైవర్లు ఆలయ నిర్మాణానికి అవసరమైన ఇసుకని ఉచితంగా అందించగా.. కొందరు దాతలు గుమ్మాలు, టైల్స్ ఇచ్చారు. అమెరికాలో ఉండే కొత్త పట్టిసీమకు చెందిన మహిళ ధ్వజస్తంభం కోసం రూ.3.5లక్షలు పంపారు. ఎప్పుడు అందిన మొత్తాన్ని అప్పుడే నిర్మాణ పనులకి వెచ్చిస్తూ వచ్చారు. కొవిడ్ కష్టకాలంలోనూ లక్ష్యాన్ని వాయిదా వేయకుండా మూడేళ్లలో ఆలయ నిర్మాణాన్ని పూర్తిచేశారు. ఫిబ్రవరి 11న శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి విగ్రహాల ప్రతిష్ఠను కనులపండువగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ఆంజనేయ, గరుత్మంతుల విగ్రహాల్నీ ప్రతిష్ఠించారు. ఈ పూజల సందర్భంగా గ్రామ యువత, పెద్దలూ ముందుకు వచ్చి నాలుగు రోజులు అన్నసమారాధన చేశారు. ఆఖరి రోజున గ్రామం మొత్తం ఏకమై వేలాది మందికి భోజనాలు పెట్టారు. మొదట్లో ‘మీకెందుకు ఈ పని’ అన్నవాళ్లే... ‘ఆడవాళ్లూ మీకు జోహార్లు’ అని ప్రశంసిస్తున్నారిపుడు.