Krishna Water Dispute : కృష్ణా జలాల పంపిణీకి సంబంధించి నూతన ట్రైబ్యునల్ అవసరం ఏముందని జల్‌శక్తిశాఖకు పంపిన లేఖలో కేంద్ర న్యాయశాఖ అభిప్రాయపడినట్లు తెలిసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన నేపథ్యంలో కృష్ణా జలాలను మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య పంపిణీ చేయాలని తెలంగాణ డిమాండు చేస్తోంది. తమ వాటా నీరు తమకే దక్కాలంటూ సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించింది. రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు, కేంద్ర జల్‌శక్తి మంత్రితో జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలోనూ ఈ డిమాండ్‌ను ప్రస్తావించింది. సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌ను వెనక్కి తీసుకుంటేనే నూతన ట్రైబ్యునల్ ఏర్పాటును పరిశీలిస్తామని అప్పుడు జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తెలిపారు.
కేంద్ర మంత్రి ప్రతిపాదనకు తెలంగాణ ప్రభుత్వం అంగీకరించి, కోర్టుకు తన అభిప్రాయాన్ని తెలియజేసింది. దాంతో పిటిషన్ ఉపసంహరణకు సుప్రీంకోర్టు అనుమతించింది. తెలంగాణ తన పిటిషన్‌ను ఉపసంహరించుకుంది. అనంతరం కొత్త ట్రైబ్యునల్ ఏర్పాటు విషయమై జల్‌శక్తిశాఖ... కేంద్ర న్యాయశాఖ సలహా కోరింది. కృష్ణా జలాల పంపిణీకి సంబంధించి సెక్షన్-89 ప్రకారం బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ విధివిధానాలను ఖరారు చేసిన నేపథ్యంలో మరోసారి అంతర్రాష్ట్ర జలవివాదాల చట్టంలోని సెక్షన్-3 ప్రకారం కొత్త ట్రైబ్యునల్ ఏర్పాటు అవసరం ఏముందని న్యాయశాఖ అభిప్రాయపడినట్లు సమాచారం.