WheelChair Cricket in Visakha : ఏ ఆటలైనా శారీరకంగా ఫిట్‌గా ఉంటేనే ఆడగలం. అది ఒకప్పటి మాట. దివ్యాగుంలమైనా తాము ఆడగలం అంటున్నారు వారంతా. అందుకు తగ్గట్టుగానే క్రేజీ ఆటల్లో ఒకటైన క్రికెట్‌ను ఎంచుకున్నారు. ఆత్మవిశ్వాసంతో బ్యాట్ పట్టారు. వీల్‌ఛైర్‌పైనే క్రికెట్ ఆడుతూ.. మనోధైర్యంతో తమ వైకల్యాన్ని అధిగమించారు. ప్రభుత్వం సహకరిస్తే జాతీయ స్థాయిలోనూ సత్తా చాటుతామని తెలుగురాష్ట్రాలకు చెందిన వీల్‌ఛైర్ డిసేబుల్ క్రికెటర్లు అంటున్నారు..
విశాఖలో ఉత్సాహంగా పోటీలు..
విశాఖలో దివ్యాంగుల వీల్‌ఛైర్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తానా సహకారంతో జాతీయ వీల్ ఛైర్ క్రికెట్ పోటీలు ఉత్సాహంగా సాగాయి. ఆంధ్ర, తెలంగాణా జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు విజయం సాధించింది. విజయాన్ని క్రీడాకారులంతా ఉత్సాహంగా పంచుకున్నారు. దివ్యాంగులమని ఎక్కడా కుంగిపోకుండా.. కేవలం చక్రాల సైకిల్‌కి పరిమితం అయిపోయామన్న భావన రానీయకుండా ఈ క్రీడ మనో బలాన్నిస్తోందని క్రీడాకారులు ఆనందం వ్యకం చేస్తున్నారు.
సరైన వసతులు లేవు..
"మాకు సరైన వసతులు, వీల్ ఛైర్లు లేవు. వాటిని ప్రభుత్వం సమకూర్చాలని కోరుతున్నాం. మా ఆటగాళ్లంతా చదువుకున్నవారే. మాకు ఆటల్లో వచ్చిన ఈ పత్రాలను ప్రభుత్వం గుర్తించి చిన్నవైనా ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించి ప్రోత్సహించాలని కోరుతున్నాం. ప్రభుత్వం సహకారం అందిస్తే ఈ వీల్ ఛైర్ ఆటలు ఆడుతూనే మమ్మల్ని, మా కుటుంబాలను పోషించుకోగలుగుతాం. "
- రాజశేఖర్, ఆంధ్ర క్రికెట్ టీం కెప్టెన్
మాలాగా ఆడడం వేరు..
"మామూలు వ్యక్తులు క్రికెట్ ఆడటం వేరు. మాలాగా వీల్ ఛైర్లలో ఆడటం వేరు. మాకు ఇలాంటి అవకాశం కల్పించిన వారందరికీ ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని టోర్నమెంట్లు పెడితే బాగుంటుందని అభిప్రాయపడుతున్నాం. అన్ని రాష్ట్రాల్లో ఈ ఆటను ఆయా ప్రభుత్వాలు ప్రోత్సహించాలని కోరుతున్నాం. "
-అరుణ్ జూన్, తెలంగాణ క్రికెట్ టీం కెప్టెన్
పోటీల్లో పాల్గొన్న వారిలో ఎక్కువ మంది ప్రమాదాల వల్ల దివ్యాంగులైన వారే ఉన్నారు. వీల్‌ఛైర్ క్రీడాకారులను ప్రభుత్వాలు సహకరించాలని వీల్‌ఛైర్ డిసేబుల్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి రామనసుబ్బారావు కోరారు.
"వీరంతా గతంలో ఇళ్లకు మాత్రమే పరితమయిన వారు. ఈ రోజు ఎంతో బాగా ఆట ఆడగలుగుతున్నారు. ఇది ఛారిటీ కార్యక్రమం కాదు.. ఇది ఒక క్రీడ. ఆటల్ని ఆటల్లాగే చూడాలి. ఈ ఆటతో ఏం చేయలేము అనుకున్న వారంతా శారీరకంగా,మానసికంగా దృఢంగా మారారు. చాలా ఉత్సాహంగా, ఆనందంగా ఈ క్రీడలో రాణిస్తున్నారు. "
-రామనసుబ్బారావు, జనరల్ సెక్రటరీ, ఏపీ వీల్‌ఛైర్ డిసేబుల్ క్రికెట్ అసోసియేషన్
సరైన శిక్షణ లభిస్తే జాతీయ స్థాయిలోనూ సత్తాచాటుతామవని... ఆంధ్ర, తెలంగాణ వీల్‌ఛైర్ క్రికెట్ క్రీడాకారులు చెబుతున్నారు.
ఇదీ చదవండి : Corona Effect on Pregnant Woman : కరోనా కాలంలో కాబోయే అమ్మ.. జర జాగ్రత్తమ్మా..!