హైదరాబాద్‌లో పలు చోట్లు ప్రతి ఏటా వర్షాకాలంలో వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతుంటారు. ఇక ఐటీ కారిడార్ పరిధిలో అయితే రోడ్లపై నీరు నిలిచి గంటల కొద్ది సమయం అక్కడే వృథా అయ్యేది. అందుకు పరిష్కార మార్గాన్ని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేశారు. గతేడాది అనుభవాలను దృష్టిలో ఉంచుకుని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు గత జనవరి నుంచే రంగంలోకి దిగారు. జీహెచ్‌ఎంసీ, టీఎస్‌ఐఐసీ, హెచ్‌ఆర్‌డీసీఎల్ తదితర విభాగాలతో పలుమార్లు సమావేశమై అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో నీళ్లు నిల్వకుండా చర్యలు తీసుకున్నారు.
జోన్ గ్రూపులో పోస్ట్
చార్మినార్, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి జోన్లకు మూడు వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేశారు. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ఉన్నతాధికారులు, జోనల్ కమిషనర్, డీసీలు, రోడ్ల నిర్వహణ బాధ్యతను దక్కించుకున్న గుత్తేదారు సంస్థ ప్రతినిధులు, స్థానిక పోలీసులు అందులో సభ్యులుగా ఉంటారు. వర్షం కురిసినప్పుడు నీళ్లు నిలిచి ట్రాఫిక్ జాం కాగానే సంబంధిత జోన్ గ్రూపులో పోస్ట్ చేస్తారు. వెంటనే అందరూ స్పందించి గంటలోపు సమస్యను పరిష్కరిస్తారు. గతేడాది గంటసేపు కురిసిన వర్షానికే సైబర్ టవర్స్-మాదాపూర్ పోలీస్‌స్టేషన్ మార్గంలో రహదారి జలమయమైంది. మాదాపూర్ అయ్యప్పసొసైటీ వైపున్న ఇళ్ల మధ్యలో నుంచి వరద నీరంతా ప్రధాన రహదారిపైకే చేరి వాహనాలు మొరాయించాయి.
చర్చించి.. పరిష్కరించేలా
గతేడాది ఏయే ప్రాంతాల్లో నీళ్లు నిలిచాయి.. ఈసారి కూడా ఎక్కడ సమస్య తలెత్తే అవకాశముందో క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి గుర్తించారు. ఆ వీడియోలను వివిధ విభాగాలతో నిర్వహించిన సమావేశంలో ప్రత్యేకంగా ప్రదర్శించారు. అక్కడ ఎలాంటి చర్యలు తీసుకోవాలో సమగ్రంగా చర్చించి కార్యాచరణను సిద్ధం చేసి అమలు చేశారు. శిల్పారామం, సీవోడీ జంక్షన్, అయ్యప్ప సొసైటీ, మైండ్ స్పేస్, హైటెక్ సిటీ, సైబర్ గేట్‌వే, రాడిసన్ హోటల్, కొత్తగూడ, ఐఐఐటీ జంక్షన్ తదితర ప్రాంతాల్లో సమస్యను పరిష్కరించారు. ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాం, టెలిగ్రాం తదితర సామాజిక మాధ్యమాల్లో వాహనదారులకు తాజా సమాచారాన్ని చేరవేస్తారు.
ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు
ఐటీ కారిడార్‌పై ప్రత్యేక దృష్టి సారించామని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ ఎస్‌ఎం విజయ్‌కుమార్ తెలిపారు. ఈ వర్షాకాలంలో ట్రాఫిక్‌పరంగా ఇబ్బందులు తలెత్తకుండా క్షేత్రస్థాయిలో అధ్యయనం చేశామన్నారు. జీహెచ్‌ఎంసీ, టీఎస్‌ఐఐసీ, హెచ్‌ఆర్‌డీసీఎల్ అధికారులతో సమన్వయం చేసుకుని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని పేర్కొన్నారు. రద్దీ ఎక్కువగా ఉండే కూడళ్లలో నీళ్లు నిల్వకుండా చూస్తున్నామని వివరించారు.
ఇదీ చూడండి : పుల్వామాలో ఎన్కౌంటర్- ఓ ముష్కరుడు హతం