Inquiry on Encounters : రాష్ట్రంలో ఎన్‌కౌంటర్లకు సంబంధించిన విచారణలు ఏ స్థాయిలో ఉన్నాయి..? ఒకవేళ పూర్తయితే ఏమైనా చర్యలు తీసుకున్నారా..? అనేవి ఇప్పటికీ ప్రశ్నార్థకమే. సంచలనం సృష్టించిన ‘దిశ’ హత్యాచారం కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు జోక్యంతో కమిషన్ ఏర్పాటు కావడంతో విషయం బహిర్గతమైంది కానీ మిగిలిన ఎన్‌కౌంటర్ల విచారణలు జాప్యానికి చిరునామాగానే మిగిలిపోతున్నాయి.
ఓ కానిస్టేబుల్ మరణించినా... 2014 ఆగస్టు 2న దొంగనోట్ల మార్పిడి ముఠాను పట్టుకునే ప్రయత్నంలో శామీర్‌పేట్ మజీద్‌పూర్ వద్ద ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముఠాసభ్యుడు ముస్తఫాతోపాటు కానిస్టేబుల్ ఈశ్వరరావు మృతిచెందారు. కాల్పుల్లో ఎస్సై వెంకట్‌రెడ్డి తీవ్రంగా గాయపడి కోలుకున్నారు. దీనిపై మెజిస్టీరియల్ విచారణ ఏళ్ల తరబడి సాగింది. ఓ కానిస్టేబుల్ మరణించినా విచారణ ఏళ్లపాటు కొనసాగడం.. ఇందుకు పోలీస్‌శాఖ నుంచి చొరవ కరవవడం విమర్శలకు తావిచ్చింది.
- అదే ఏడాది ఆగస్టు 14న శంషాబాద్ శివార్లలోని కొత్వాల్‌గూడలో గొలుసుదొంగ కడవలూరి శివను పోలీసులు ఎన్‌కౌంటర్‌లో హతమార్చారు. వాహనతనిఖీల సమయంలో ఆపిన తమపై శివ కత్తితో దాడి చేయడంతో తాము జరిపిన కాల్పుల్లో అతడు మరణించినట్లు వెల్లడించారు.
- 2015 ఏప్రిల్‌లో జనగామ జిల్లా ఆలేరులో పట్టపగలే నడిరోడ్డుపై ఎన్‌కౌంటర్ జరిగింది. వరంగల్ కేంద్ర కారాగారం నుంచి నాంపల్లి కోర్టుకు తరలిస్తున్న అయిదుగురు ఎస్కార్ట్ వాహనంలోనే పోలీసుల కాల్పుల్లో మృతిచెందారు. వికారుద్దీన్ సహా అయిదుగురు తమ ఆయుధాల్ని లాక్కునేందుకు ప్రయత్నించడంతో కాల్పులు జరపాల్సి వచ్చిందని పోలీసులు ప్రకటించారు. చేతులకు సంకెళ్లతో ఉన్న వారిని కాల్చారంటూ ఆందోళనలు చెలరేగడంతో ఐపీఎస్ అధికారి సందీప్‌శాండిల్య నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేశారు.
- అదే ఏడాది జూన్‌లో తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఉస్మానియా విద్యార్థి వివేక్‌తోపాటు శ్రుతి, విద్యాసాగర్ మృతిచెందారు. వీరిని మావోయిస్టులని పోలీసులు పేర్కొనగా.. నిరాయుధులను పట్టుకొచ్చి కాల్చి చంపారని ప్రజాసంఘాలు ఆరోపించాయి.
- 2016 ఆగస్టు 8న షాద్‌నగర్ మిలీనియం టౌన్‌షిప్‌లో కరడుగట్టిన గ్యాంగ్‌స్టర్ నయీమ్ ఎన్‌కౌంటర్‌లో మృతిచెందాడు. ఈ ఉదంతంపై కూకట్‌పల్లి అప్పటి ఏసీపీ భుజంగరావు దర్యాప్తు చేసి నివేదిక సమర్పించారు.
- 2017 డిసెంబరులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎనిమిది మంది గిరిజనులు ఎన్‌కౌంటర్‌లో మృతిచెందారు. వారిని నక్సలైట్లుగా పోలీసులు ప్రకటించారు. కానీ వారిని చిత్రహింసలుపెట్టి చంపేశారని స్థానికులు ఆరోపించారు. ఈ అన్ని ఉదంతాలకు సంబంధించి విచారణల్లో ఏం తేలిందో, నివేదికల్లో ఏముందో ఇప్పటికీ రహస్యమే.