Water Holes in Telangana Forests : సర్కారీ కాంట్రాక్టు అంటే కాసుల పంటే! ఊళ్లో కట్టేవాటి నాణ్యతే అంతంతమాత్రం. ఇక అడవుల్లో నిర్మాణాలంటే చెప్పేదేముంది! మూగజీవాల గొంతు ఎండగట్టి.. వాటి నోట మట్టి కొట్టి కాసుల పంట పండించుకున్న వ్యవహారమిది. వేసవికాలంలో అడవుల్లో ఉండే నీటి చెలమలు, వాగులు ఎండిపోవటంతో వన్యప్రాణులు విలవిలలాడుతుంటాయి. నీటి కోసం వెతుకులాటలో కొన్ని సమీపంలోని జనావాసాల్లోకి ప్రవేశించి వేటగాళ్ల ఉచ్చుకు బలవుతుంటాయి లేదా మనుషులకో, పశువులకో హాని కలిగిస్తుంటాయి. ఇలాంటి అనర్థాలు తలెత్తకుండా చూడ్డానికి మూగజీవాలకు నీటి వసతి కల్పించాలని తలపెట్టిన అధికారులు పనుల్లో నాణ్యత గురించి మాత్రం పట్టించుకోలేదు.
కొన్ని బాగానే ఉన్నా.. పర్యవేక్షణ లేదు..
Saucer Pits in Telangana Forest : అడవుల్లో అనేకచోట్ల నిర్మించిన చెక్‌డ్యాంలు, సాసర్ పిట్లు, నీటి కుంటలు నిర్మించిన కొద్దికాలానికే పాడైపోయాయి. మరికొన్ని నిర్వహణ లోపాలతో నిరుపయోగమయ్యాయి. అడవిలో కదా ఎవరు చూస్తారులే అనే ఉద్దేశంతో తూతూమంత్రంగా కట్టేశారు. వరంగల్ అర్బన్, మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లాల్లో ‘ఈనాడు-ఈటీవీ భారత్’ క్షేత్రస్థాయిలో పరిశీలనలో వెల్లడైంది. గతంలో కట్టిన చెక్‌డ్యాంలు, సాసర్‌పిట్లు బాగానే ఉండగా కరోనా తర్వాత చేపట్టిన పనులు మాత్రం పర్యవేక్షణ లేక డొల్లగా మిగిలాయి.
పగుళ్లు.. కింది నుంచి నీటి లీకేజ్
Water Holes in Forests Telangana : వరంగల్ అర్బన్ ధర్మసాగర్ మండలం దేవనూరు అటవీప్రాంతంలో రూ. 5 లక్షల వ్యయంతో గత ఏడాది చెక్‌డ్యాం కట్టారు. నీటిని నిలిపితే వన్యప్రాణులకు తాగేందుకు ఉపయోగపడుతుందనేది అధికారుల ఉద్దేశం. కట్టి ఏడాది కాకుండానే అప్పుడే దీనికి పగుళ్లు వచ్చాయి. నాణ్యత లేక కింది నుంచి నీళ్లు కారుతున్నాయి. పక్క నుంచి నీళ్లు పారుతున్నాయి. చెక్‌డ్యాం నుంచి కాంక్రీటు రాలి పడుతోంది. దీంతో రూ.5 లక్షల ఖర్చు వృథా అయింది. అడవిలో ఉండటం వల్ల తనిఖీలు, పర్యవేక్షణ ఉండదనే ఉద్దేశంతో ఇష్టానుసారం కట్టినట్లు కనిపిస్తోంది. దానికి ఇవతల రహదారికి దగ్గరలో చాలాకాలం క్రితం కట్టిన చెక్‌డ్యాం మాత్రం మెరుగ్గానే ఉండడం గమనార్హం.
కొట్టుకుపోయిన కట్ట..
నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం సోమార్‌పెట్ అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల కోసం గతేడాది ఓ కుంట చుట్టూ 75 మీటర్ల కట్ట నిర్మించారు. ఊరికే మట్టిని కుప్ప పోసినట్లు నిర్మించిన ఆ కట్ట చిన్నపాటి ప్రవాహానికే కొట్టుకుపోయింది. దీంతో వచ్చిన నీళ్లు వచ్చినట్లే కిందికి వెళ్లిపోవటంతో మూగజీవాలకు నీటి కొరత తప్పడంలేదు. ఈ కుంటకు దగ్గరలోనే 1,200 లీటర్ల నీళ్లు నిల్వ ఉండేలా సాసర్‌పిట్ నిర్మించారు. ట్రాక్టర్లలో నీళ్లు తెచ్చి ఇందులో పోస్తే మృగాలు దాహం తీర్చుకునేవి. నిర్వహణ లేక ఆ పిట్ మొత్తం మట్టితో కూరుకుపోయింది. దానిని తొలగించి నీటితో నింపాల్సిన అటవీ సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఖర్చు నిరుపయోగం అయింది.
బోరు పాడైనా దిక్కులేదు
నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం సత్తనపల్లి అటవీప్రాంతంలో సోలార్ విద్యుత్తు బోరు వేశారు. సహజ నీటి వనరులను తలపించేలా బోరు నుంచి నీళ్లు బండరాళ్ల పైనుంచి గుంతలోకి వెళ్లేలా ఏర్పాట్లుచేశారు. కొన్నాళ్లకే బోరు పాడైనా దానిని పట్టించుకోవడం లేదు. నీళ్లు రాకపోవడంతో వన్యప్రాణుల దాహర్తితో అలమటిస్తున్నాయి. వేసవి నాటికైనా ఈ కృత్రిమ నీటి వనరులను మెరుగు పరచకపోతే వన్యప్రాణులకు తాగునీటి కష్టాలు పెరిగి అడవులు నుంచి ఊళ్ల మీద పడే ప్రమాదముంది.