రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న వర్షాల వల్ల ముంపునకు గురైన వక్ఫ్ బోర్డు ప్రాంతాలతో పాటు శిథిలావస్థకు చేరిన పలు భవనాలను బోర్డు ఛైర్మన్ మహమ్మద్ సలీమ్ పరిశీలించారు. హైదరాబాద్ నాంపల్లిలోని రైల్వే స్టేషన్ వెనకాల ఉన్న భవనాలను అధికారులతో కలిసి పర్యవేక్షించారు.
శిథిలావస్థకు చేరిన భవనాల్లో ఉన్న అద్దెదారులను ఖాళీ చేయించి... నూతన భవనాలను నిర్మిస్తామని సలీమ్ పేర్కొన్నారు. మంచి భవనాలల్లో అద్దెకు ఉన్న ప్రతి ఒక్కరు కిరాయిలు చెల్లించాలని... లేని పక్షంలో ఖాళీ చేయిస్తామని తెలిపారు.
వచ్చిన అద్దె డబ్బులతో పేద ప్రజలను ఆర్థికంగా అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు... వక్ఫ్ బోర్డు ఆస్తులను కబ్జా చేసిన వారిని కఠినంగా శిక్షించి ఆస్తులను స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేశారు. ఈ ఆస్తులను రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ చట్టంలోకి తీసుకురావడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన సలీమ్... సీఎం సూచన మేరకు వక్ఫ్ బోర్డు అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.