ఏపీ మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన నిందితుడు డ్రైవర్ దస్తగిరి కీలక వ్యాఖ్యలు చేశారు. కోర్టుకు నివేదించినట్లుగా పోలీసులు తనకు రక్షణ కల్పించట్లేదని ఆరోపించారు. పులివెందుల దాటి వెళ్తే తన వెంట సెక్యూరిటీ రావట్లేదని.. తనకు కేటాయించిన గన్‌మెన్లు తనతో ఉండట్లేదని ఆరోపించారు. ప్రతిసారీ సీబీఐ అధికారులకు ఫోన్ చేసి సెక్యూరిటీ పంపాలని కోరటం ఇబ్బందిగా మారిందన్నారు. తనకు ప్రాణహాని జరిగితే తిరిగి తీసుకురాగలరా? అని ప్రశ్నించారు.
"కోర్టుకు నివేదించినట్లుగా పోలీసులు నాకు రక్షణ కల్పించట్లేదు. పులివెందుల దాటి వెళ్తే నా వెంట సెక్యూరిటీ రావట్లేదు. నాకు ఇచ్చిన గన్‌మెన్లు నాతో ఉండట్లేదు. ప్రతిసారీ సీబీఐ అధికారులకు ఫోన్ చేస్తున్నా. ఫోన్ చేసి సెక్యూరిటీ పంపాలని కోరడం ఇబ్బందిగా ఉంది. నాకు ప్రాణాహాని జరిగితే మళ్లీ నా ప్రాణాలు తెస్తారా? నా కదలికలు తెలుసుకుంటున్నారు తప్ప నాకు రక్షణగా ఉన్నట్లు లేదు."
- దస్తగిరి, వివేకా హత్య కేసు నిందితుడు
మళ్లీ మెుదలైన విచారణ: వివేకా హత్యకేసులో సీబీఐ విచారణ మళ్లీ మొదలైంది. రెండు నెలల తర్వాత సీబీఐ అధికారులు మరోసారి విచారణ చేపట్టారు. నిన్న(శుక్రవారం) కడప కేంద్ర కారాగారం అతిథి గృహంలో అనుమానితులను ప్రశ్నించారు. పులివెందులకు చెందిన వైకాపా కార్యకర్త కిరణ్ కుమార్ యాదవ్‌ను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. వివేకా కేసులో సీబీఐ అరెస్ట్ చేసిన సునీల్ యాదవ్ సోదరుడే కిరణ్ కుమార్ యాదవ్.
గతంలో సునీల్ యాదవ్, కిరణ్ కుమార్ యాదవ్, తల్లిదండ్రులను కూడా సీబీఐ పలుమార్లు ప్రశ్నించింది. ప్రస్తుతం సునీల్ యాదవ్ కడప జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో అతని సోదరుడు కిరణ్ కుమార్ యాదవ్ ను మరోసారి దాదాపు రెండు గంటల పాటు సీబీఐ అధికారులు విచారించారు. న్యాయవాది సమక్షంలో కిరణ్‌ను విచారించినట్లు సమాచారం. వివేకా హత్య కేసుకు సంబంధించి పలు అంశాలపై కిరణ్ కుమార్ యాదవ్‌ను ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
ఇవీ చదవండి: