ఆంధ్రప్రదేశ్ విజయవాడలో రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ప్రజలు భౌతిక దూరం పాటించకపోవడం వల్లే కేసులు పెరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. కృష్ణలంక, కార్మికనగర్ ప్రాంతాల్లోని ఇద్దరు ట్రక్కు డ్రైవర్లు లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించడం వల్ల ఒకేచోట ఎక్కువ కేసులు నమోదయ్యాయని చెప్పారు. కృష్ణలంకలో ఓ ట్రక్కు డ్రైవరు తనకు సమయం గడవడం లేదని.. ఇంట్లో తన కుటుంబంతో ఉండకుండా చుట్టుపక్కల వారిని పిలిచి వారితో పేకాట ఆడాడు. వారి పిల్లలు, మహిళలు బయటకొచ్చి ఒక ఇంటి నుంచి మరొక ఇంటికి వెళ్లి హౌసీ తదితర ఆటలు ఆడడం ద్వారా సుమారు 24 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని కలెక్టరు ఆవేదన వ్యక్తం చేశారు.
అలాగే కార్మికనగర్‌కు చెందిన మరో ట్రక్కు డ్రైవరు.. తన కుటుంబ సభ్యులతోపాటు ఇరుగు పొరుగు వారిని కలవడం ద్వారా సుమారు 15 మందికి పాజిటివ్ కేసులు వచ్చాయని తెలిపారు. కరోనా వైరస్ సామాజిక వ్యాప్తి చెందుతున్నందునే లాక్‌డౌన్ అమలు చేస్తున్నామని అన్నారు. దాన్ని గౌరవించాల్సిన బాధ్యత సమాజంలోని ప్రతి వ్యక్తిపైనా ఉందని విజ్ఞప్తి చేశారు.
వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బంది, రెవెన్యూ, ఇతర శాఖల యంత్రాంగం కరోనా వ్యాప్తిని నియంత్రించడానికి ఎంతగా ప్రయత్నించినా... ప్రజలు భౌతిక దూరం పాటించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్లిష్ట సమయంలో ప్రతి ఒక్కరూ ఇంటి నుంచి బయటకు రావొద్దని.. ఎవరినీ కలవొద్దని కలెక్టరు విజ్ఞప్తి చేశారు.
కృష్ణా జిల్లాలో కేసుల సంఖ్య 127కు చేరడం... ఇవాళ ఒక్కరోజే 25 కేసులు నమోదు కావడం... విజయవాడ నగరంలోనే అత్యధిక కేసులు ఉండడంతో అధికారులు అత్యవసర సమావేశం నిర్వహించారు. కృష్ణలంక ప్రాంతంలోని 14 వేల మంది నివాసితులకు.. ఇంటికే నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. రెడ్ జోన్ ప్రాంతాలకు నిత్యావసరాలు అందిస్తామని.. ప్రజలెవ్వరూ బయటకు రావద్దని మంత్రి వెల్లంపల్లి కోరారు.
ఇదీ చూడండి: నీళ్లు ఎక్కువ తాగితే బరువు తగ్గుతారా?