Book Festival Rally: ఏపీలోని విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ ఆధ్వర్యంలో జరుగుతున్న 32వ విజయవాడ పుస్తక మహోత్సవం.. పండగ వాతావరణంలో సాగుతోంది. పుస్తక పఠనంపై ప్రజల్లో మరింత ఆసక్తి పెంచేందుకు ఈ రోజు పుస్తక ప్రియులతో పాదయాత్ర చేపట్టనున్నారు. విజయవాడ ప్రెస్‌క్లబ్ దగర నుంచి ర్యాలీగా బయలుదేరి.. యాత్ర నిర్వహించనున్నారు. గత 30 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ పాదయాత్రకు విశిష్టమైన చరిత్ర ఉంది. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు వావిలాల గోపాలకృష్ణయ్య నాయకత్వంలో తొలిసారి పాదయాత్ర నిర్వహించారు. ఆ తరువాత ప్రస్తు ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, జస్టిస్ ఆవుల సాంబశివరావు, ముళ్లపూడి వెంకటరమణ, కాళోజీ నారాయణరావు లాంటి ప్రముఖులెందరో ఈ పాదయాత్రలో పాలుపంచుకున్నారు. పుస్తక పఠనంపై ఆసక్తిని పెంచేందుకు తమ వంతు ప్రయత్నం చేశారు.
కోల్‌కతా పుస్తక ప్రదర్శన స్ఫూర్తితో పాదయాత్ర..
32nd Vijayawada Book Festival Rally Today: దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే కోల్‌కతా పుస్తక ప్రదర్శన స్ఫూర్తితో పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. 32వ పుస్తక మహోత్సవంలో భాగంగా పుస్తక ప్రియుల పాదయాత్రను ముఖ్య ఎన్నికల అధికారి కె.విజయానంద్ జెండా ఊపి ప్రారంభించనున్నారు. గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.పి.సిసోడియా ఆధ్వర్యంలో ర్యాలీ జరగనుంది. ప్రదర్శనలో శ్రీశ్రీ మహాప్రస్థానం భారీ పుస్తకం అందరినీ ఆకర్షిస్తోంది. 70 ఏళ్లు పూర్తైన సందర్భంగా శ్రీశ్రీ ప్రింటర్స్ మహాప్రస్థానం పుస్తకాన్ని తిరిగి ప్రచురించింది. ఇలాంటి అనేక అరుదైన రచనలతో పుస్తక మహోత్సవం..సందడిగా సాగుతోంది.
ఇదీ చదవండి..