పాడి రైతులకు తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య శుభవార్త చెప్పింది. పెరుగుతున్న నిర్వహణ వ్యయం దృష్టిలో పెట్టుకుని.. విజయ డెయిరీ రైతులకు చెల్లించే పాల సేకరణ ధర లీటరుపై మరో 1 రూపాయి చొప్పున పెంచింది. ఇది ప్రభుత్వం ఇస్తున్న లీటరు పాలపై 4 రూపాయల ప్రోత్సాహకానికి అదనం. ఈ నిర్ణయం వల్ల సంవత్సరానికి లక్ష మందికి పైగా పాడి రైతులు ప్రయోజనం పొందుతారు.
విజయ డెయిరీ ద్వారా అదనంగా సంవత్సరానికి కనీసం 12 కోట్ల రూపాయలు.. పాల బిల్లుల రూపంలో రైతులకు చెల్లిస్తున్నామని ఆ సంస్థ ఛైర్మన్ లోకా భూమారెడ్డి అన్నారు. లీటరుకు 4 రూపాయల ప్రోత్సాహకం బకాయిలను ప్రభుత్వం ఇటీవల పూర్తిగా చెల్లించిందన్నారు.
ప్రస్తుతం పెంచిన 1 రూపాయితో ఇతర ప్రైవేటు, సహకార డెయిరీలతో పోలిస్తే విజయ తెలంగాణ డెయిరీ అందరి కంటే ఎక్కువగా పాల ధర చెల్లిస్తుందని చెప్పారు. తాజా నిర్ణయం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు పాడి రైతులు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
ఇదీ చూడండి: శ్రీనివాస్‌రెడ్డికి సీఎం కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు