Vigilance officers inspections: రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని సాకుగా చూపి.. వినియోగదారుల్ని దోచుకుంటున్న వంటనూనెల వ్యాపారులే లక్ష్యంగా విజిలెన్స్ అధికారులు ఏపీ వ్యాప్తంగా తనిఖీలు చేపట్టారు. విశాఖలో ఐదు బృందాలుగా ఏర్పడిన విజిలెన్స్ అధికారులు..ప్రైవేట్ మార్టులు, గోదాముల్లో సోదాలు చేపట్టారు. కృత్రిమ కొరత సృష్టిస్తే.. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వ్యాపారుల్ని హెచ్చరించారు. తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం, పెద్దాపురం డివిజన్‌లోని నూనె దుకాణాల్లో విజిలెన్స్, రెవెన్యూ, తూనికలు కొలతల శాఖ అధికారులు సోదాలు చేశారు. పలు చోట్ల అక్రమ నిల్వలు గుర్తించి..కేసులు నమోదు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు.
విస్తృత సోదాలు చేపట్టిన విజిలెన్స్ అధికారులు...
కృష్ణా జిల్లాలో విజయవాడ, గొల్లపూడి, పెనమలూరు, ఆగిరిపల్లి, పోరంకి ప్రాంతాల్లో విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్, లీగల్ మెట్రాలజీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. గుంటూరు జిల్లాలో వంటనూనెల దుకాణాలు, మిల్లులు, హోల్ సేల్ ఏజెన్సీలపై విజిలెన్స్ బృందాలు విస్తృత సోదాలు చేపట్టారు. నరసరావుపేటలో పలు వ్యాపారులపై కేసులు నమోదు చేశారు. బాపట్ల, సత్తెనపల్లి, చిలకలూరిపేటలోని అనేక దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఓ ఆయిల్ దుకాణంలో పరిమితికి మించి అదనంగా ఉన్న సుమారు 10 వేల లీటర్ల వంటనూనెను స్వాధీనం చేసుకుని దుకాణాన్ని సీజ్ చేశారు. కర్నూలు జిల్లా ఆదోనిలోని నూనె దుకాణాల్లో విజిలెన్స్ అధికారులు విస్తృత సోదాలు చేపట్టారు. నంద్యాలలో లైసెన్స్ పునరుద్ధరణ చేసుకోని జ్యోతి ఆయిల్ ట్రేడర్స్‌కు తాళాలు వేశారు.
నెల్లూరు, కావలి గూడూరు, నాయుడుపేటలో తనిఖీలు నిర్వహించిన అధికారులు రికార్డుల నిర్వహణలో లోపాలు గుర్తించారు. తిరుపతి, చిత్తూరు, పీలేరు, రేణిగుంట ప్రాంతాల్లో విజిలెన్స్, తూనికలు, కొలతలు, పౌరసరఫరాలశాఖ అధికారులు ఏకకాలంలో సోదాలుచేశారు. వంటనూనెలు, నిత్యావసర సరుకుల్ని అధిక ధరకు విక్రయిస్తున్న వ్యాపారులపై కేసులు నమోదు చేశారు.