Vice President Venkaiah Naidu visits muchintal: రామానుజాచార్యుల సహస్రాబ్ధి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. నిత్యపూజలు, యాగాలు కొనసాగుతుండగా... దేశం నలుమూలల నుంచి స్వామిజీలు, పీఠాధిపతులు సమతామూర్తి కేంద్రాన్ని సందర్శిస్తున్నారు. చినజీయర్ స్వామి సంకల్పాన్ని కొనియాడుతున్నారు. ఉత్సవాల్లో భాగంగా 11వ రోజు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సమతామూర్తి కేంద్రాన్ని సందర్శించనున్నారు. సాయంత్రం 6.30 నిమిషాలకు ముచ్చింతల్ చేరుకుని.... చిన్నజీయర్ స్వామితో కలిసి కేంద్రంలో పర్యటించనున్నారు. రామానుజాచార్యుల విగ్రహంపై ఆవిష్కతమయ్యే 3డీ మ్యాపింగ్‌ను వీక్షించనున్నారు. అనంతరం ప్రవచన మండపంలో భక్తులను ఉద్దేశించి అరగంటపాటు ప్రసంగిస్తారు. తర్వాత యాగశాలకు వెళ్లి శ్రీలక్ష్మినారాయణ మహాయాగంలో పాల్గొననున్న వెంకయ్య... వేదపడింతుల ఆశీర్వచనాలు తీసుకోనున్నారు.
ప్రత్యక్ష నిదర్శనం...
Ramanuja Sahasrabdi Utsav: సహస్రాబ్ది ఉత్సవాల్లో భాగంగా ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా ముచ్చింతల్ సందర్శించారు. చినజీయర్ స్వామితో కలిసి ప్రాంగణంలో కలియ తిరిగారు. భారతీయ సనాతన ధర్మతత్వాన్ని తెలుసుకోవాలనే ప్రతి వ్యక్తికి సమతామూర్తి కేంద్రం ప్రత్యక్ష నిదర్శనమని వ్యాఖ్యానించారు. పతంజలి గ్లోబల్ విశ్వవిద్యాలయం, గురుకులాల నిర్మాణ డిజైన్లను చినజీయర్ స్వామి అనుమతించాకే నిర్మాణం చేపడుతామని చెప్పారు. తమిళనాడు గవర్నర్ రవీంద్రనారాయణ్ రవి కూడా సమతామూర్తి కేంద్రాన్ని దర్శించుకున్నారు.
భారతీయ ధర్మతత్వాన్ని తెలుసుకోవాలనుకునేవారు సమతామూర్తి కేంద్రాన్ని సందర్శించాలని నేను కోరుతున్నాను. భారతీయ సంస్కృతిలోని సనాతన ధర్మం, బుషి ధర్మం, వేద ధర్మం అనే ఆశ‌్య, ఆగమన సంప్రదాయాలను వ్యవహారిక రూపంలో చూడాలంటే ఇక్కడికి తప్పకుండా రావాలి.
-రాందేవ్ బాబా, యోగా గురువు
అల్లు అర్జున్, రోజా సందడి...
సమతామూర్తి కేంద్రంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సందడి చేశారు. దివ్యదేశాలు, భద్రవేది సహా ప్రతి నిర్మాణం గురించి అల్లు అర్జున్ అడిగి తెలుసుకున్నారు. రామానుజాచార్యుల విగ్రహంతో సెల్ఫీ తీసుకున్నారు. అక్కడ కూచిపూడి నృత్యం చేస్తున్న విద్యార్థులను పలకరించారు. సినీనటి రోజా కూడా వేదికపైనే ఉండటంతో ఆమెతో కాసేపు ముచ్చటించారు.
ఉత్సవాల్లో భాగంగా 11వరోజు ఉదయం గంటపాటు అష్టాక్షరీ మహామంత్ర జపం జరిగింది. అనంతరం యాగశాలలో లక్ష్మినారాయణ మహాయాగం యథాతథంగా జరగనుంది. ఉదయం 10 గంటల నుంచి పరమేష్టి ఇష్టి, వైభవేష్టి ఇష్టి హోమాలు నిర్వహించనున్నారు.
ఇదీ చూడండి: వైభవంగా సహస్రాబ్ది వేడుకలు... సందర్శించిన బాబా రాందేవ్