Venkaiah Naidu special story : భారత ప్రధానిగా దేశ ఆర్థిక, సామాజిక వ్యవస్థను మలుపు తిప్పిన తెలుగు ఠీవీ.. పీవీ. ఆ తర్వాత.. దేశ ప్రజల హృదయాల్లో అంతలా హత్తుకుపోయిన జాతీయ స్థాయి తెలుగు నాయకుడు ఎవరైనా ఉన్నారా? అంటే అందరి నుంచి కచ్చితంగా.. ఠక్కున వచ్చే సమాధానం ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అనే. విద్యార్థి ఉద్యమాల నుంచి ప్రజా జీవితంలో ప్రవేశించి.. అసాధారణ వాగ్దాటి, అసమాన నాయకత్వ పటిమతో అత్యున్నత స్థానాలకు చేరుకున్న ఆయన ప్రయాణం ప్రతిఘట్టం అంత ప్రత్యేకం మరి. అసెంబ్లీలో, పార్లమెంట్‌లో మాటల బాణాలు సంధించి అందర్నీ మెప్పించి.. ఒప్పించిన ఈ రాజనీతిజ్ఞుడు ఉపరాష్ట్రపతి పదవిలోనూ.. రాజ్యసభ ఛైర్మన్ బాధ్యతల నిర్వహణలోనూ అంతే హుందాగా ఒదిగి పోయారు. అయిదేళ్లు గిర్రున తిరిగిపోవడంతో ఆ బాధ్యతలు మరొకరికి అప్పగించేందుకు వీడ్కోలు తీసుకుంటున్నారు ఈ అందరివాడు.
ఆహార్యం, మాటతీరు, పంచెకట్టు ద్వారా తెలుగుదనం మూర్తీభవించిన వ్యక్తి.. తెలుగు జాతి గర్వించదగ్గ నేత ముప్పవరపు వెంకయ్య నాయుడు. ఎంత ఎదిగినా ఇప్పటికీ ఒదిగి ఉండడం ఆయన తత్వం. నిత్యం ప్రజల మధ్య ఉండడమే ఎంతోఇష్టం. ఇవాళ అన్ని ప్రాంతాల ప్రజలకు ఆమోదయోగ్యమైన, సుపరిచితుడైన, అందరి గౌరవాన్ని అందుకున్న జాతీయ నాయకుడెవరని అభిప్రాయ సేకరణ చేస్తే.. అగ్రశ్రేణిలో ఉండే నేత వెంకయ్య నాయుడు. ఎందుకంటే 5దశాబ్దాలకు పైగా దేశ రాజకీయాల్లో ఉన్న ఆయన వ్యక్తిత్వం గురించి ఎవరికీ పరిచయం చేయనవసరం లేదు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఏ హోదా చేపట్టినా, ఆ పదవికి వన్నె తెచ్చిన నేత వెంకయ్య. దేశంలో ఏ మూలన సంక్షోభం వచ్చినా స్పందించి, తనదైన శైలిలో పరిష్కరించేందుకు ప్రయత్నించే నేత ఆయన.
స్వతంత్ర భారతంలో జన్మించి ఉపరాష్ట్రపతి పదవి చేపట్టిన తొలివ్యక్తి వెంకయ్యనాయుడు. సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉండడంతో పాటు.. ఇంతకాలం మనలో ఒకడిగా ఉండి.. ఉపరాష్ట్రపతి బాధ్యతలు చేపట్టిన తొలివ్యక్తీ ఆయనే అని వెంకయనాయుడికి స్వయంగా కితాబిచ్చారు దేశ ప్రధాని మోదీ.
"ఎగువసభలోని ప్రతి అంశం గురించి తెలిసిన వ్యక్తి. సభాసభ్యుడు, స్థాయీసంఘాల ఛైర్మన్, మంత్రిగా అన్నింటిలో భాగస్వామ్యం వహించిన తొలి ఉపరాష్ట్రపతి ఇప్పుడు దేశానికి లభించారు. ప్రజా జీవనంలో జేపీ ఉద్యమాల నుంచి ఎగసిన కెరటం ఆయన. నిజాయితీ, సుపరిపాలన కోసం దేశవ్యాప్తంగా జరిగిన ఆందోళనల్లో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ విద్యార్థి నేత స్థాయి నుంచి ఇక్కడి వరకు స్వయంకృషితో ఎదిగారు. అసెంబ్లీ, రాజ్యసభ ఏదైనా ఆయన తన వ్యక్తిత్వాన్ని చాటారు. తన కార్యక్షేత్రాన్నివిస్తరించుకుంటూ వచ్చారు. వెంకయ్యనాయుడు రైతుబిడ్డ. ఆయనతో కలసి పనిచేసే అదృష్టం నాకు లభించింది." - నరేంద్రమోదీ, ప్రధానమంత్రి
తను అధిష్టించిన పదవిగౌరవాన్ని మరింత పెంచేలా ఆయన శక్తిమేర కృషి చేస్తారని.. విపక్ష సభ్యుల మనసులనూ గెలుచుకునేలా వ్యవహరించగలరని విశ్వసిస్తున్నానంటూ నాటి ప్రసంగం ముగించారు మోదీ. ఆ అంచనాలకు మించి.. అధికార విపక్ష సభ్యులందరి మన్ననలు పొందారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.
పార్టీ పదవిలో ఉన్నా, మంత్రిపదవిలో ఉన్నా, ఇప్పుడు ఉపరాష్ట్రపతిగా ఉన్నా ఆయన ప్రజల మధ్యే ఉండడానికి ఇష్టపడతారు. అందుకే దేశంలో వెంకయ్యనాయుడు కాలు మోపని ప్రాంతం లేదంటే అతిశయోక్తికాదు. పార్టీ ప్రధానకార్యదర్శిగా ఉన్నప్పుడే దేశంలో అన్నిరాష్ట్రాలు, అధ్యక్షుడయ్యాక అన్నిజిల్లాలు చుట్టేసిన ఆయన, ఉపరాష్ట్రపతిగా రాజ్యాంగపరమైన ప్రోటోకాల్ పాటిస్తూనే.... వాటిని తనకు అనువైన విధంగా సడలించుకుని ప్రజల్లో కలిసిపోతూ తన ప్రత్యేకత చాటారు.