ప్రకృతిని నిర్లక్ష్యం చేసినందుకే అది మానవాళిపై ఉగ్రరూపం చూపిస్తోందని భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. దేశం వేగంగా ముందుకెళుతున్నా... ఇంకా చాలా మంది వెనకబడి ఉన్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల జీవనశైలి వల్లనే సమాజంలో వింత జబ్బులు వస్తున్నాయని వెంకయ్యనాయుడు వివరించారు. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లోని స్వర్ణభారత్ ట్రస్ట్ ఆవరణంలో స్వర్ణభారత్ ట్రస్ట్, యశోద హాస్పిటల్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని వెంకయ్యనాయుడు ప్రారంభించారు.
ఈ సందర్భంగా పద్మ అవార్డు గ్రహీతలు పీవీ సింధు, భాష్యం విజయ సారథి, చింతల వెంకట్ రెడ్డిలను ఉపరాష్ట్రపతి ఘనంగా సన్మానించారు. గతంలో గుర్తించబడని వారిని గుర్తించి పద్మ అవార్డులు ఇవ్వాలని మోదీ నిర్ణయించడం సంతోషకరమని ఉపరాష్ట్రపతి అనందం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా 12 మంది రైతులకు పద్మ అవార్డులు రావడం గొప్ప విషయంగా ఆయన అభివర్ణించారు. దేశానికి మంచి పేరు తీసుకొచ్చిన వారిని సన్మానిస్తే సమాజం తనను తాను గౌరవించుకున్నట్లేనని తెలిపారు. వైద్యం అందుబాటులో లేని వారికి సేవ చేసుకోవడం అదృష్టంగా భావించాలన్నారు. పేదలకు దూరమైన వైద్యాన్ని దగ్గర చేయడమే స్వర్ణ భారత్ లక్ష్యమని ఉపరాష్ట్రపతి స్పష్టం చేశారు. మాతృభాషను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిదని... మాతృభాషలో నైపుణ్యం ఉంటేనే ఇతర భాషలను వేగంగా నేర్చుకోవచ్చునని వెంకయ్యనాయుడు వివరించారు.
స్వర్ణభారతి ట్రస్ట్ చేస్తున్న సేవా కార్యక్రమాల పట్ల బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు సంతోషం వ్యక్తం చేశారు. ప్రజలకు ఉచిత సేవలు చేసే ప్రాంతంలో తనను సత్కరించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు.