ఉన్నతమైన సమాజానికి భాష, సంస్కృతులే చక్కని పునాది వేస్తాయని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని దిల్లీలో దక్షిణాఫ్రికా తెలుగు సమాఖ్య నిర్వహించిన ‘మన భాష –మన సమాజం – మన సంస్కృతి’ అంతర్జాల సదస్సును ఆయన ప్రారంభించారు. గిడుగు రాంమూర్తి పంతులు జయంతి అయిన తెలుగు భాషా దినోత్సవం నాడు.. భాష, సంస్కృతి, సమాజం పరంగా మనం ఎక్కడ ఉన్నామనే అంశాన్ని సింహావలోకనం చేసుకోవటం ముదావహమని వ్యాఖ్యానించారు.
ప్రజలకు అర్థం కాని భాషలో ఉన్న విజ్ఞానం సమాజానికి మేలు చేయదని గిడుగు భావించారన్న ఉపరాష్ట్రపతి... అందుకే పుస్తకాల్లో సులభమైన తెలుగును వాడాలని ఉద్యమించారని పేర్కొన్నారు. మాతృభాషను కాపాడుకోవడమే ఆ మహనీయునికి అందించే నిజమైన నివాళి అన్నారు.
మన సంస్కృతి, చిరునామాలను భవిష్యత్తు తరాలకు అందించడం భాష ద్వారానే సాధ్యమన్నారు. ప్రపంచీకరణ వల్ల భాషలు అంతరించే ప్రమాదంలో పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక భాషల మీద ఆయా ప్రాంతాల్లోని వర్సిటీల్లో అధ్యయనాలు జరగాలని సూచించారు. పురోభివృద్ధిని కోరుకునే వారు మాతృభాషను మరువకూడదని వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి: కేబుల్ రంగంలో తనదైన ముద్ర వేశారు: బండి సంజయ్