ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళంలో పుట్టి.. మేనమామ వద్ద విద్యాభ్యాసం చేసి... ఏలూరు కళాశాలలో అధ్యాపకునిగా సేవలందించిన వేల్చేరు నారాయణరావు... అంతర్జాతీయ పాఠకులకు తెలుగు సాహిత్యాన్ని పరిచయం చేసే బాధ్యతను తనకుతానే భుజాన వేసుకున్నారు. దాదాపు యాభై ఏళ్లకు పైగా తెలుగు సాహిత్య ప్రాచుర్యం కోసం పనిచేశారు. పలు ప్రాచీన తెలుగు రచనలను ఆంగ్లంలోకి అనువదించి ప్రపంచ దేశాలకు తెలుగు గొప్పతనాన్ని చాటి చెప్పారు. ఆ అనువాద రచనలు అమెజాన్‌లో అందరికీ అందుబాటులో ఉన్నాయి.
పలు రచనలు ఆంగ్లంలోకి అనువాదం
ఏలూరులో విద్యాభ్యాసం పూర్తి చేసిన నారాయణరావు... సీఆర్ రెడ్డి కళాశాలలో అధ్యాపకునిగా సేవలందించారు. మాతృభాష కీర్తిని ఖండాంతరాలకు వ్యాపింపజేసే ప్రయత్నంలో భాగంగా... అమెరికా వెళ్లి అక్కడ తెలుగు ఆచార్యునిగా సేవలందించారు. అప్పుడే ఎవరూ ఊహించని విధంగా ప్రబంధాలు, కావ్యాలు, శతకాలు తదితర సాహిత్యాన్ని ఆంగ్లంలోకి తర్జుమా చేశారు. తెలుగు సాహిత్యం గురించి తెలుసుకోవాల్సిన అవసరాన్ని విదేశీయులకు అర్థమయ్యేలా చెప్పేందుకు కృషి చేశారు.
అమెరికా నుంచి ఏడాది క్రితం వచ్చేసిన ఆయన... ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం కొప్పాకలో జీవిస్తున్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ ఫెలోషిప్‌కు ఎంపిక కావడంపై సంతోషం వ్యక్తం చేశారు. తెలుగు కవితలు, పద్యాలు రాసే రచయితలు అనేక మంది ఉన్నారని... ఆలోచనలు రేకెత్తించేలా వచనం రాసేవారు రావాలని.. అప్పుడే తెలుగుభాషకు అంతర్జాతీయ ఖ్యాతి వస్తుందని అభిప్రాయపడ్డారు.
వర్సిటీల నుంచి సాహిత్యాభిమానులు దాకా.. భాషాభివృద్ధికి కృషి చేయాల్సిన అవసరముందని నారాయణరావు అభిప్రాయపడ్డారు. ఇందులో యువతరాన్ని భాగస్వామ్యం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు.
ఇదీ చదవండి: పసిగుండెలకు ప్రాణదాయని ‘సాయి సంజీవని’