కొవిడ్-19 నేపథ్యంలో వ్యవసాయ రంగం, రైతాంగం కొత్త దారులు వెతుక్కుంటోంది. ఏప్రిల్, మే మాసాల్లో పట్టణాలు, నగరాల నుంచి సొంత గ్రామాలకు వెళ్లిన ఎంతో మంది యువత సేద్యంబాట పట్టారు. ఈ క్రమంలో పల్లెల్లో ఆరుగాలం శ్రమించి పండించిన పంటలు అమ్ముకోవడానికి వినూత్న మార్గాల్లో మార్కెట్, వ్యాపార అవకాశాలు సృష్టించుకోడంపై పలు స్టార్టప్ సంస్థలు ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. హైదరాబాద్ హైటెక్ సిటీలో ఐటీ నిపుణులు, వినియోగదారులకు కూరగాయలు, పండ్లు లభ్యత కొరతను గమనించిన క్రాప్ టూ కిచెన్ రైతు ఉత్పత్తిదారుల సహకార సంఘం నడుం బిగించింది.
ప్రైవేటు మార్కెట్ సేవలు...
చిల్లర వర్తకుల డిమాండ్ దృష్ట్యా... మాదాపూర్ వేదికగా పండ్లు, కూరగాయల ప్రైవేటు మార్కెట్ తెరిచింది. ఈ సేవలను ఎమ్మెల్యే అరికపూడి గాంధీతో కలిసి రాష్ట్ర జల వనరుల అభివృద్ధి సంస్థ - టీఎస్‌డబ్ల్యూఆర్‌డీసీ ఛైర్మన్ వీరమల్ల ప్రకాశ్‌రావు ప్రారంభించారు. రైతుల విజ్ఞప్తి మేరకు గచ్చిబౌలి, మాదాపూర్, జూబ్లీహిల్స్, కొండాపూర్, మియాపూర్, లింగపల్లి, పటాన్‌చెరు ప్రాంతాల్లో చిల్లర వర్తకుల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని సీ2కే ఎఫ్‌పీఓ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చారు.
ఫోన్ కొట్టు పండ్లు పట్టు...
లాక్‌డౌన్ సమయంలో రైతులను ఆదుకునేందుకు కొన్ని ప్రభుత్వేతర సంస్థలు ముందుకొచ్చాయి. వాక్ ఫర్ వాటర్, క్రాప్ టూ కిచెన్ రైతు ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో గిట్టుబాటు ధర చెల్లించి రైతుల నుంచి సేకరించిన ఉత్పత్తులను వినియోగదారుల చెంతకు చేర్చారు. కరోనా ఆంక్షల దృష్ట్యా తెలుగు రాష్ట్రాల్లో తోటలు దెబ్బతిని రైతులు నష్టపోయిన వేళ మార్కెటింగ్ ఊరట కల్పనకు నడుం బిగించారు. ఖమ్మం, నల్గొండ, వరంగల్, పాలమూరు ఉమ్మడి జిల్లాల రైతుల వద్ద కొన్న పండ్లు హైదరాబాద్ జంట నగరాల్లో సరఫరా చేస్తున్నారు. 'ఫాం టూ హోం' పేరిట 'ఫోన్ కొట్టు పండ్లు పట్టు' అనే నినాదంతో ఉత్పత్తులను ఇంటింటికి పంపారు. 6 రకాల పండ్లను రూ.300కే ఇంటికి చేరవేయగా మంచి స్పందన లభించింది. అదే స్ఫూర్తితో క్రాప్ టూ కిచెన్ ఎఫ్‌పీఓ మాదాపూర్ వేదికగా ఆన్‌లైన్ బుకింగ్‌పై పాలు, మాంసం, కూరగాయలు, పండ్ల సరఫరాకు శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమానికి కూడా మంచి స్పందన లభించింది.
టోకు మార్కెట్ ఏర్పాటు...
గడ్డిఅన్నారం, బోయినపల్లి, గుడిమల్కాపూర్ వ్యవసాయ మార్కెట్ యార్డుల నుంచి పండ్లు, కూరగాయలు తీసుకొచ్చి హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో విక్రయించాలంటే చిరు, చిల్లర, తోపుడు బండ్ల వ్యాపారులకు పెద్దకష్టంతో కూడుకున్న వ్యవహారమైంది. దూరాభారం కావడంతో పాటు టోకు ధరల్లో ఆ సరుకు తీసుకొచ్చి హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో విక్రయించే సమయానికి తాజాదనం, నాణ్యత, రుచి, శుచి దెబ్బతింటోంది. ఈ ఇబ్బందులు అధిగమించేందుకు మాదాపూర్ ఎన్ కన్వెన్షన్ పక్కన ప్రాంగణలో ఈ టోకు మార్కెట్ కొలువు తీరింది. వినియోగదారులకు తొందరగా తాజా కూరగాయలు, పండ్లు లభ్యం కావడానికి ఇదొక చక్కటి మార్గమైంది.
బల్క్‌గా ఉంటే రైతుల చెంతకే...
కోటి జనాభా గల విశ్వనగరంలో నాణ్యమైన ఉత్పత్తులకు మంచి డిమాండ్ సహజం. హైదరాబాద్ చుట్టు పక్కల రంగారెడ్డి, మహబూబ్‌నగర్, మెదక్, నల్గొండ సహా దూర ప్రాంతాలైన ఖమ్మం, వరంగల్ వంటి ఉమ్మడి జిల్లాల్లో రైతులు పండించిన ఉద్యానోత్పత్తులు నేరుగా క్రాప్ టూ కిచెన్ రైతు ఉత్పత్తిదారుల సంఘంలో అమ్ముకోవచ్చు. రైతులకు అండగా ఉండమే కాకుండా సేంద్రీయ పద్ధతుల్లో ఉత్పత్తి చేసిన పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు అందించాలనేది ఎఫ్‌పీఓ లక్ష్యం. బల్క్‌గా ఉంటే నేరుగా రైతుల చెంతకే వెళ్లి కొనుగోలు చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది.
లాభం మొత్తం అన్నదాతకే చెందేలా...
ఇక నుంచి సీజనల్‌గా లభ్యమయ్యే అన్ని రకాల పండ్లు కూడా విక్రయించాలని క్రాప్ టూ కిచెన్ అంకుర సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. హైటెక్ సీటి పరిసర ప్రాంతాల వినియోగదారుల నుంచి వస్తున్న స్పందన దృష్ట్యా నేరుగా రైతుల నుంచి సేకరించిన కూరగాయలు, పండ్లు, పాలు, ఇతర నిత్యావసర వస్తువులు కూడా మార్కెటింగ్ చేయాలని యోచిస్తోంది. ఉద్యాన శాఖ, మార్కెటింగ్ శాఖ సంయుక్త సహకారంతో మధ్య దళారీ వ్యవస్థ నిర్మూలన కోణంలో ఏం లాభం వచ్చినా కూడా అది కష్టపడే అన్నదాతకే చెందాలన్న సంకల్పంతో ఈ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది.
యువతకు కూడా అవకాశం...
ఇప్పటికే ఆన్‌లైన్ లేదా ఫోన్ బుకింగ్‌లపై వినియోగదారులకు కావాల్సిన పాలు, మాంసం సరఫరా చేస్తున్న క్రాప్ టూ కిచెన్ రైతు ఉత్పత్తిదారుల సంఘం... ఇక నుంచి పండ్లు, కూరగాయలు కూడా సరఫరా చేయాలని నిర్ణయించింది. వ్యవసాయం, వ్యాపార ధృక్పథంతో ముందుకొచ్చే ఔత్సాహిక రైతులు, యువత, విద్యావంతుల సేవలు కూడా వినియోగించుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు సీ2కే స్టార్టప్ వర్గాలు పేర్కొన్నాయి.