ఏపీలోని పట్టిసీమలో అతి పురాతనమైన శివక్షేత్రంగా అలరారుతోంది వీరభద్రస్వామి ఆలయం. పవిత్ర గోదావరి నదిలో స్నానంచేసి ఇక్కడ స్వామిని దర్శించుకుంటే కోరిన కోర్కెలు నెరవేరతాయని అంటారు. పెళ్లికానివారు ఆలయ ప్రధాన మండపంలో ప్రదక్షిణలు చేసి మొక్కుకుంటే త్వరగా పెళ్లిళ్లు అవుతాయని భక్తుల నమ్మకం. అలా కుదిరినవారు తరువాత స్వామికి మొక్కులు చెల్లించడం ఇక్కడ సంప్రదాయంగా వస్తోంది. అలాగే సంతానం లేని మహిళలు ఇక్కడున్న అనిస్త్రీ, పునిస్త్రీ దేవతలను దర్శించుకుని పక్కనే ఉన్న చెట్టుకు ముడుపు కడతారనీ అంటారు. వీరభద్రుడు భద్రకాళీ సమేతంగా దర్శనమిచ్చే ఈ ఆలయానికి క్షేత్రపాలకుడిగా భూనీలా సమేత భావనారాయణస్వామి కొలువై ఉంటే... కనకదుర్గ, మహిషాసురమర్దిని గ్రామ దేవతలుగా భక్తుల పూజలు అందుకోవడం విశేషం.
స్థలపురాణం:
తండ్రి దక్షుడు చేసిన అవమానం భరించలేక సతీదేవి అగ్నికి ఆహుతి అవుతుంది. అది విన్న పరమేశ్వరుడు ప్రళయతాండవం చేస్తూ తన జటాఝూటం నుంచి ఒక జడను తీసి నేలకు కొట్టడంతో అందులోంచి వీరభద్రుడు బయటకొచ్చాడట. దక్షుడి యాగాన్ని ధ్వంసం చేసి, అతడి శిరస్సును ఖండించమని వీరభద్రుడిని పరమేశ్వరుడు ఆదేశించాడట. ఈశ్వరుడు చెప్పినట్లుగా చేసిన వీరభద్రుడు ఆ తరువాత దేవకూట పర్వతంపైన ప్రళయతాండవం చేయడం మొదలుపెట్టాడట. దానికి భూమి అదరడంతో దేవతలంతా కలిసి అగస్త్య మహాముని సాయం కోరతారట. ఆయన వీరభద్రుడిని ఆలింగనం చేసుకోవడంతో వీరభద్రుడు లింగాకారంగా మారిపోయాడట. అలా వీరభద్రుడు ఇక్కడ స్వయంభువుగా వెలిశాడని చెబుతారు.
అదేవిధంగా ఈ క్షేత్రానికి సంబంధించి మరో కథా ప్రాచుర్యంలో ఉంది. పూర్వం పర్వతాలు గగన సంచారం చేస్తూ తెల్లారేసరికి భూమిపైన దిగేవట. దాంతో భూమిపైన ఉన్న జీవరాశులకు ప్రాణాపాయం ఉంటుందనే ఉద్దేశంతో ఇంద్రుడు తన వజ్రాయుధంతో ఆ పర్వతాల రెక్కల్ని ఖండించాడట. ఆ సమయంలోనే దేవకూట పర్వతం నది మధ్యలో పడి పోయిందట. అయితే... కొంతకాలం తరువాత దేవకూట పర్వతరాజు నారదుడి సలహాతో శివపంచాక్షరీ మంత్రాన్ని జపించి శివుడి అనుగ్రహం పొంది.... తనపైన కూడా స్థిరనివాసం ఏర్పరచుకోమని శివుడిని వేడుకున్నాడట. అలా శివుడు ఇక్కడ కొలువయ్యాడనీ అంటారు.
వాళ్లే ధర్మకర్తలుగా..
ఇక్కడున్న శివలింగం చుట్టూ అగస్త్యుడి హస్త చిహ్నాలూ, లింగం పైభాగాన వీరభద్రుని జడలు ముడివేసిన శిఖముడి కూడా కనిపిస్తుందని అంటారు. ఈ ఆలయాన్ని చోళ చక్రవర్తులు నిర్మించినా ఆ తరువాత ప్రతాపరుద్రుడు అభివృద్ధి చేశాడని చరిత్ర చెబుతోంది. ఈ ప్రాంతాన్ని ఏలిన రెడ్డి రాజుల్లో మంగభూపతిదేవు, లక్ష్మీ నారాయణ దేవు అనే సోదరులు ఆలయం నిర్వహణకు ఎన్నో కానుకలు, అగ్రహారాలను కూడా సమర్పించారట. తరువాత పోలవరం జమీందారు కొచ్చర్లకోట జగ్గయ్య శివకేశవులిద్దరికీ ఎన్నో విలువైన కానుకలు సమర్పించడంతో ఆ వంశంవాళ్లే ఇప్పటికీ ధర్మకర్తలుగా వ్యవహరిస్తున్నారని చెబుతారు. శివరాత్రి రోజున లింగోద్భవ కాలంలో స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ సమయంలో తూర్పుగోదావరి జిల్లా సీతానగరం గ్రామానికి చెందిన మట్టా కుటుంబీకులు రాత్రంతా స్వామిని తిరునాళ్లలో ఊరేగించడం ఓ సంప్రదాయంగా వస్తోంది. ఏటా ఈ నది మధ్యలో జరిగే శివరాత్రి ఉత్సవాలకు వచ్చే లక్షల మంది భక్తుల కోసం నెలరోజుల ముందునుంచే అధికారులు ఏర్పాట్లు చేస్తారు. కార్తికమాసంలో స్వామికి చేసే లక్షపత్రి పూజను చూసేందుకు రెండుకళ్లూ చాలవని చెబుతారు.
ఎలా చేరుకోవచ్చంటే..
రాజమహేంద్రవరం, నిడదవోలు వరకూ రైల్లో వస్తే అక్కడినుంచి ఆలయానికి బస్సులూ, ప్రైవేటు వాహనాలూ ఉంటాయి. నిడదవోలుకు నలభైకిలోమీటర్ల దూరంలో పట్టిసీమ ఉంది. పట్టిసీమ రేవు నుంచి పడవపైన ప్రయాణించి ఆలయానికి చేరుకోవచ్చు.
ఇదీ చూడండి: గెస్ట్ టీచర్లను క్రమబద్ధీకరించాలి: ఆర్. కృష్ణయ్య