పీసీఓఎస్ (పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్).. మహిళల పాలిట శాపంగా పరిణమిస్తోందీ ప్రత్యుత్పత్తి సమస్య. మన దేశంలో ప్రతి ఐదుగురు మహిళల్లో ఒకరు ఈ సమస్యతో బాధపడుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఇక వీరిలో నెలసరి క్రమం తప్పడం, సంతానలేమి.. వంటి ఆరోగ్య సమస్యలతో పాటు అందం పరంగానూ పలు సవాళ్లు ఎదురవుతుంటాయి. విపరీతంగా జుట్టు రాలిపోవడం, అవాంఛిత రోమాలు ఎక్కువగా రావడం, మొటిమలు.. వంటి సమస్యలు పీసీఓఎస్‌తో బాధపడుతోన్న మహిళల్లో సర్వ సాధారణంగా వస్తుంటాయి. మరి, పీసీఓఎస్ ఒకసారి వచ్చిందంటే ఇక దీర్ఘకాలం మనతోనే ఉంటుంది.. కాబట్టి ఈ సౌందర్య సమస్యలు కూడా ఎక్కువ కాలం పాటు వేధిస్తాయని భయపడాల్సిన అవసరం లేదంటున్నారు నిపుణులు. ఎందుకంటే పీసీఓఎస్ పూర్తిగా నయం కాకపోయినా.. చక్కటి లైఫ్‌స్టైల్‌తో దాన్ని అదుపులో ఉంచుకుంటే ఇటు ఆరోగ్యపరంగా, అటు సౌందర్య పరంగా తలెత్తిన ఇబ్బందుల్ని పరిష్కరించుకోవచ్చని చెబుతున్నారు.
అందుకే ఈ సమస్యలన్నీ!
పీసీఓఎస్ ఉన్న మహిళల్లో అసాధారణ స్థాయిలో ఆండ్రోజన్స్ (పురుష హార్మోన్లు) ఉత్పత్తవుతుంటాయి. ఇవి అండాశయాలపై చిన్న చిన్న సిస్టుల్లాగా కనిపిస్తుంటాయి.. ఫలితంగా హార్మోన్ల స్థాయుల్లో హెచ్చుతగ్గులు ఏర్పడుతుంటాయి. ఈ హార్మోన్ల అసమతుల్యత చర్మం, జుట్టు నిర్మాణ కణజాలాలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. తద్వారా చర్మం నుంచి అధిక మొత్తంలో సీబమ్ (మన శరీరంలో సెబేషియస్ గ్రంథులు విడుదల చేసే మైనపు పదార్థం) విడుదలవుతుంది. ఇది బుగ్గలు, గడ్డం, నుదురు.. తదితర భాగాల్లో మొటిమలు రావడం, పిగ్మెంటేషన్‌కు కారణమవుతుంది. కొన్ని సార్లు చంకలు, మెడ.. భాగాల్లో చర్మం పొడిబారడం, నల్లగా మారడం.. వంటివి సైతం గమనించచ్చు.
ఇక పీసీఓఎస్ కారణంగా ముఖం, ఛాతీ, వీపు.. వంటి భాగాల్లో అవాంఛిత రోమాలొస్తాయి. ఇలా ఉన్నట్లుండి వెంట్రుకలు పెరగడాన్ని ‘హిర్సుటిజం’ అంటారు. దీంతో పాటు నుదురు భాగంలో ఉండే జుట్టు (Frontal Hairline) బాగా రాలిపోవడం కూడా గమనించచ్చు. మరి, ఇలాంటి సమస్యల నుంచి విముక్తి పొందాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి అని చెబుతున్నారు నిపుణులు.
ఇవి గుర్తుంచుకోండి!
పీసీఓఎస్‌తో ఎదురయ్యే అనారోగ్యాల్ని, సౌందర్య సమస్యల్ని దూరం చేసుకోవాలంటే ముందుగా శరీరంలో విడుదలయ్యే ఆండ్రోజన్ హార్మోన్ల స్థాయుల్ని అదుపు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఇవి గుర్తుపెట్టుకోవాలి.
* శీతల పానీయాలు, పండ్ల రసాలు.. వంటి చక్కెరలు అధికంగా ఉండే ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. ఇక టీ/కాఫీల్లో పాలకు బదులుగా బాదం పాలను ఉపయోగించడం మంచిదని చెబుతున్నారు నిపుణులు.
* గర్భనిరోధక మాత్రలు అవాంఛిత రోమాలు పెరగడాన్ని, విపరీతంగా జుట్టు రాలడాన్ని అరికడతాయని చెబుతున్నారు నిపుణులు. అయితే వీటిని వైద్యుల సలహా మేరకు మాత్రమే వాడాల్సి ఉంటుంది.
* జింక్ సప్లిమెంట్స్, జింక్ ఎక్కువగా లభించే కోడిగుడ్లు, చేపలు, నట్స్, గింజలు.. వంటి ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల జుట్టు రాలే సమస్య నుంచి విముక్తి పొందచ్చని ఓ అధ్యయనంలో తేలింది.
* గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉండే పదార్థాల్లో కార్బోహైడ్రేట్లు, చక్కెరలు అధికంగా ఉంటాయి. ఇవి మొటిమల సమస్యను మరింతగా పెంచుతాయి. కాబట్టి తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండే పప్పులు, క్యారట్లు, ఆకుకూరలు, ఆకుపచ్చటి కాయగూరలు.. వంటివి ఆహారంలో భాగం చేసుకోవాలి.
* పీసీఓఎస్‌ను దూరం చేసుకోవడానికి నిపుణులు సూచించే వ్యాయామాలు, యోగాసనాలు.. వంటివి మొటిమలు, జుట్టు రాలే సమస్యల్ని కూడా అదుపు చేస్తాయంటున్నారు నిపుణులు. కాబట్టి క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మాత్రం మరవద్దు.
ఇక ఇవన్నీ ప్రయత్నించినా కొంతమందిలో సమస్య తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుంది. అలాంటి వారు సమస్యల్ని పూర్తిగా దూరం చేసుకోవడానికి లేజర్, హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్.. వంటి చికిత్సలు తీసుకోవాలనుకుంటారు. అయితే వీటి విషయంలో మీ సొంత నిర్ణయం కాకుండా.. మీ సమస్య తీవ్రతను బట్టి వైద్యుల సలహా తీసుకోవడమే మంచిది. తద్వారా ఇతర దుష్ప్రభావాలు తలెత్తకుండా జాగ్రత్తపడచ్చు.
ఇదీ చదవండి: ఆమె ఇల్లే నందనవనం... భూతదయకు తానో నిదర్శనం