Vasenapoli Food Center in visakha: రోజులు మారే కొద్దీ ప్రకృతిసేద్యంతో పండించే ఆహార ధాన్యానికి గిరాకీ పెరుగుతోంది. ఫైవ్ స్టార్ హోటళ్ల సంగతి పక్కనబెడితే రోడ్డుపక్కనుండే ఆహార బండ్లు దగ్గరా వినియోగదారుల సందడి బాగానే కనిపిస్తోంది. ఇక్కడ మనం చూస్తున్న ఈ వాసెనపోలి అల్పాహార కేంద్రమూ అలాంటిదే.
ఏపీలోని విశాఖలో ఉన్న ఈ వాసెనపోలి ఆహారకేంద్రాన్ని చిట్టెం సుధీర్ అనే యువకుడు ఏర్పాటు చేశాడు. గిరిజనుల ఆరోగ్యం, ఆహారశైలిని పరిశీలించడం ద్వారా..... రసాయన రహిత ఆహారాన్ని వినియోగదారులకు చేరువ చేయాలని నిర్ణయించుకున్నాడు. రాగులు, జొన్నలు, ఇలా వివిధ రకాల చిరుధాన్యాలతో ఇడ్లీలు, దోసెలు అందిస్తున్నాడు. ఇక్కడ టిఫిన్లతో పాటు వాసెనపోలి అనే పేరుకు ప్రత్యేకంగా తెలుగు నేపథ్యం ఉందంటున్నారు సుధీర్.
వాసెనపోలి అంటే ఆవిరి కుడుముకి ముందు తెలుగు పదంగా చెబుతాడు సుధీర్. అందుకే ఈ పేరును పెట్టినట్టు వివరించాడు. ఇందులో గిరిజన ప్రాంతంలో సేకరించిన చిరుధాన్యాలు, అక్కడి నుంచి తెచ్చిన అడ్డాకు వంటి వాటిని వినియోగించి ఈ అల్పాహారాలను సిద్దం చేస్తున్నారు. ఆరోగ్య కరమైన, రుచికరంగా ఉండే వీటిని స్వీకరించేందుకు నగర వాసులు ఇష్టాన్ని కనబరుస్తున్నారు.
ఉపరాష్ట్రపతిని మెప్పించాడు
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఇటీవల విశాఖ పర్యటనలో.. వాసెనపోలి నుంచి ఇడ్లీ తెప్పించుకుని రుచిచూశారు. ఆ వెంటనే ట్విటర్ వేదికగా ప్రశంసించారు. ఈ ట్వీట్‌తో సుధీర్ ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. వాసెనపోలి పేరే కాదు. ఇందులో టిఫిన్లూ విభిన్నంగా ఉన్నాయంటున్నారు వినియోగదారులు. ఉపాధి మార్గంవైపు యువత ప్రయత్నాలకు...ఆహార రంగంలో ఈ తరహా కొత్త అలోచనలు జతచేయడం.. పురోగతి బాటకు వీలుకల్పిస్తుందని వినియోగదారులు అభిప్రాయపడుతున్నారు.
ఇదీ చదవండి:
CM KCR Family Special Pooja: అష్టలక్ష్మి ఆలయంలో సీఎం కేసీఆర్ కుటుంబసభ్యుల ప్రత్యేక పూజలు