SGT Posts in Telangana : ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగ నోటిఫికేషన్ల ప్రకటన చేసినప్పటి నుంచి రాష్ట్ర నిరుద్యోగులు తమ ప్రిపరేషన్ మొదలుపెట్టారు. ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న తరుణం ఆసన్నమైన తరుణంలో ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని భావిస్తున్నారు. ముఖ్యంగా విద్యాశాఖలో కొలువులు పొందేందుకు చాలా మంది నిరీక్షిస్తున్నారు. దానికి తగిన శిక్షణ పొందుతూ పరీక్షలకు సిద్ధంగా ఉన్నారు.
Secondary Grade Teachers Posts in Telangana :పాఠశాల విద్యాశాఖలో మొత్తం 13,086 ఉపాధ్యాయ కొలువులను భర్తీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించగా వాటిలో సెకండరీ గ్రేడ్ టీచర్ల (ఎస్‌జీటీ) కొలువులు 6,400 వరకు ఉండనున్నాయి. బీఈడీ పూర్తి చేసిన అభ్యర్థులూ వీటికి పోటీపడవచ్చు. మరో 3,600 వరకు స్కూల్ అసిస్టెంట్ (ఎస్‌ఏ) ఖాళీలు ఉంటాయని విద్యాశాఖవర్గాల ద్వారా తెలిసింది. అంటే స్థానిక సంస్థలు, ప్రభుత్వ పాఠశాలల్లో భర్తీ చేసే ఉద్యోగాల సంఖ్య 10,000లోపు ఉండనుంది. మిగిలిన 3,000 ఖాళీల్లో 1,024 ఉద్యోగాలు మోడల్ స్కూళ్లలో ఉండగా.. మరో 200 వరకు తెలంగాణ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (టీఆర్‌ఈఐఎస్)ల్లో టీచర్లు ఉంటారని సమాచారం. ఈ రెండు విద్యా సంస్థల్లో ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (టీజీటీ), పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్స్ (పీజీటీ) ఉంటారు. వారు ఆంగ్ల మాధ్యమంలో బోధించాల్సి ఉంటుంది. కొన్ని బోధనేతర ఉద్యోగాలు కూడా ఉంటాయని తెలిసింది.
టెట్ నిర్వహణకు ప్రతిపాదన
TET Exam in Telangana : జిల్లా ఎంపిక కమిటీల (డీఎస్సీ) ద్వారా ఉపాధ్యాయ కొలువులను భర్తీ చేయడం వల్ల అవకతవకలు జరుగుతున్నాయని భావించిన ప్రభుత్వం 2017లో వీటిని టీఎస్‌పీఎస్సీకి అప్పగించింది. అక్కడా న్యాయపరంగా ఎదురైన సమస్యలు అన్నీ ఇన్నీకావు. ఇప్పటికీ 300 హిందీ పండిత్ పోస్టుల భర్తీ పెండింగ్‌లో ఉంది. జిల్లా కేడర్ పోస్టులను కలెక్టర్ ఆధ్వర్యంలోని డీఎస్సీతోనే భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉపాధ్యాయ కొలువులను భర్తీ చేయాలంటే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) జరపాలని, అనుమతి ఇవ్వాలని కోరుతూ విద్యాశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి దస్త్రం పంపినట్లు సమాచారం. ఇది ఎప్పటికి ఆమోదం పొందుతుందో ఇప్పుడే చెప్పలేమని కొందరు అధికారులు అంటున్నారు.