రాష్ట్రంలో అమృత్, స్మార్ట్ సిటీ పనులతో పాటు పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణాన్ని మరింత వేగవంతం చేయాలని పట్టణాభివృద్ధి పార్లమెంటరీ స్థాయి సంఘం సూచించింది. ఛైర్మన్ జగదాంబికాపాల్ నేతృత్వంలోని స్థాయీసంఘం సమావేశం ఇవాళ హైదరాబాద్లో జరిగింది. రాష్ట్రంలో పురపాలకశాఖ తరపున చేపట్టిన వివిధ కార్యక్రమాలు, కేంద్ర ప్రభుత్వం నుంచి అందుతోన్న నిధులు, వినియోగం, తదితర అంశాలపై సమావేశంలో సమీక్షించారు. పీఎం స్వానిధిలో భాగంగా వీధివ్యాపారులకు రుణాలు ఇచ్చే విషయంలో ముందంజలో ఉన్న తెలంగాణను పార్లమెంటరీ స్థాయీ సంఘం అభినందించింది. స్వయం సహాయక మహిళా సంఘాలకు రుణాల విషయంలోనూ బాగానే ఉందని అధికారులను ప్రశంసించింది. 2022 నాటికి అందరికీ ఇళ్లు ఉండాలన్న లక్ష్యంతో కేంద్ర నిధులు ఇస్తున్నప్పటికీ తెలంగాణ ఎందుకు వినియోగించుకోవడం లేదని ప్రశ్నించినట్టు తెలిసింది.
రెండు పడక గదుల ఇళ్ల పథకంలో కేంద్రం వాటా ఉన్నప్పటికీ... ప్రధాని మోదీ ఫొటో ఎందుకు పెట్టడం లేదని ఎంపీ బండి సంజయ్ ప్రశ్నించినట్టు సమాచారం. స్మార్ట్ సిటీ ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మ్యాచింగ్ గ్రాంట్ విడుదల చేయలేదని... కరీంనగర్ ఎంపీ నేతృత్వంలో స్మార్ట్ సిటీ అడ్వైజరీ కౌన్సిల్ ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించినట్లు తెలిసింది. వీధి వ్యాపారులను ఎందుకు తొలగిస్తున్నారని... టౌన్ వెండింగ్ కమిటీలు ఎందుకు ఏర్పాటు చేయలేదని కమిటీ అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు బండి సంజయ్, ఆదాల ప్రభాకర్ రెడ్డి, వైఎస్ చౌదరి, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్ కుమార్, సంచాలకులు సత్యనారాయణ, ఎస్బీఐ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: కాళేశ్వరం దర్శనీయ స్థలమే అవుతుంది : బండి సంజయ్