AP CM Jagan Flexi Hulchul : ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ప్రాంతంలో రోడ్ల దుస్థితిపై వినూత్న నిరసన తెలిపారు. 'జగన్ అన్న ఉన్నాడు జాగ్రత్త' అంటూ సామర్లకోట - వేమగిరి కెనాల్ రోడ్డుపై గుర్తుతెలియని వ్యక్తులు ఫ్లెక్సీ ఏర్పాటుచేశారు. అనపర్తి శివారు ద్వారపూడి వెళ్లే దారిలో ఈ ఫ్లెక్సీ ఉంది. ఆ మార్గంలో వెళ్లే వారంతా ఫ్లెక్సీని ఆసక్తిగా గమనిస్తున్నారు.
'జగన్ అన్న ఉన్నాడు.. జాగ్రత్త' అనే ఈ బోర్డు స్థానికంగా కలకలం రేపుతోంది. రోడ్ల దుస్థితిని నిరసిస్తూ గుర్తు తెలియని వ్యక్తులు దీనిని ఏర్పాటు చేశారు. 'జగన్ అన్న ఉన్నాడు జాగ్రత్త.. రోడ్డు వేసేవరకు ఈ బోర్డును ఎవరూ తొలగించకూడదని.. ఒకవేళ తొలగిస్తే వారు ఈ రోడ్డుపైనే పోతారని' పేర్కొంటూ అనపర్తి శివారు ద్వారపూడి వెళ్లే దారిలో బోర్డును ఏర్పాటు చేశారు.
రోడ్ల దుస్థితిని వివరిస్తూ ఏకంగా ముఖ్యమంత్రి ఫొటో, పేరుతో ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం స్థానికంగా కలకలంగా మారింది. రోడ్ల పరిస్థితి ఇప్పటికైనా మారాలని స్థానికులు కోరుతున్నారు.