Ugadi celebration in Qatar: ఖతార్‌లో ఆంధ్రకళావేదిక ఆధ్వర్యంలో ఉగాది సంబురాలు ఘనంగా నిర్వహించారు. ఐడీఎల్ ఇండియన్ స్కూల్లో 'పండుగ చేస్కో' పేరిట వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన చిన్నారులు, పెద్దల సాంస్కృతిక ప్రదర్శనలు, లఘునాటికలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
నంది అవార్డు గ్రహీత, సినీ నేపథ్య గాయని ఉష హాజరై.. పాటలు, మాటలతో అలరించారు. ఈ కార్యక్రమం తన సొంతింట్లో ఆత్మీయులతో చేసుకొనే వేడుకలా ఉందని ఉష తెలిపారు. ఖతార్‌లోని భారత రాయబార కార్యాలయం నుంచి వేడుకల్లో పాల్గొన్న రాజకీయ, సమాచార వ్యవహారాల కార్యదర్శి పద్మ కర్రీ.. ఆంధ్ర కళావేదిక కార్యవర్గాన్ని అభినందించారు. ఇంతమంచి కార్యక్రమంలో పాల్గొన్న గాయని ఉషాకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగు సంఘాల అధ్యక్షులు, కార్యవర్గానికి అభినందనలు తెలిపారు.
ఉగాది వేడుకల కార్యక్రమానికి ఖతార్‌లోని తెలుగు ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వచ్చిందని.. ఆంధ్రకళావేదిక అధ్యక్షుడు వెంకప్ప భాగవతుల ఆనందం వ్యక్తం చేశారు. కేవలం వారం రోజుల్లోనే ఎన్నో అవాంతరాలను అధిగమించి ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి కృషిచేసిన వారికి అభినందనలు తెలిపారు. ఈ వేడుకలకు సుమారు 700 మందికిపైగా హాజరైనట్లు చెప్పారు. ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించేందుకు వీలుకల్పించిన స్పాన్సర్స్, శుభోదయం సంస్థల అధినేత డా.లక్ష్మిప్రసాద్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఇదీచూడండి: Pragathi bhavan ugadi celebrations: 'శుభకృత్ నామ సంవత్సరంలో అంతా శుభమే'