ఆర్టీసీ కార్మిక సంఘాల ఐకాస శనివారం తలపెట్టిన రాష్ట్ర బంద్‌కు అన్ని వర్గాలు మద్దతు ప్రకటించాయి. విపక్షాలు, ప్రజా, విద్యార్థి సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ప్రభుత్వంలో సంస్థను విలీనం చేయడం సహా పలు డిమాండ్లతో ఆందోళన బాట పట్టిన కార్మికులు బంద్‌ను విజయవంతం చేయాలనే కృతనిశ్చయంతో ఉన్నారు.
డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు పోరాటం ఉద్ధృతం చేయాలని నిర్ణయించారు. శనివారం చేపట్టిన రాష్ట్ర బంద్‌కు అన్ని వర్గాల మద్దతు లభించింది. డిమాండ్లు నెరవేరేవరకు పోరాటం కొనసాగుతుందని ఐకాస కన్వీనర్ అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సకల జనుల సమరభేరి సదస్సుకు.. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం తదితరులు హాజరయ్యారు. సమ్మెతో రాష్ట్రమే మూగబోయిందన్న అశ్వత్థామరెడ్డి ... ప్రజారవాణా వ్యవస్థను బతికించాలనే సంకల్పంతోనే పోరాడుతున్నట్లు వెల్లడించారు.
కేసీఆర్‌కు భంగపాటు తప్పదు....
నాటి తెలంగాణ ఉద్యమంలో సకలజనుల సమ్మె స్థాయిలో ప్రజలంతా ప్రభుత్వంపై తిరగబడేందుకు సిద్ధమయ్యారని విపక్ష నేతలు వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా కేసీఆర్ ప్రభుత్వం దిగిరాకపోతే... భంగపాటు తప్పదని హెచ్చరించారు. ప్రభుత్వ మొండి వైఖరి వల్లే రాజ్యాంగ సంక్షోభం తలెత్తే ప్రమాదముందని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం వ్యాఖ్యానించారు.
ఎన్హెచ్ఆర్సీకి సీపీఐ లేఖ...
బంద్‌కు మద్దతుగా శనివారం దిల్లీలోని తెలంగాణభవన్ ముట్టడిస్తామని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు నారాయణ ప్రకటించారు. ఆర్టీసీ సమ్మెపై జాతీయ మానవ హక్కుల సంఘం ఛైర్మన్‌కు సీపీఐ ప్రధాన కార్యదర్శి రాజా, జాతీయ కార్యవర్గ సభ్యుడు నారాయణ లేఖ రాశారు. కార్మికుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వ్యవహరిస్తోందని... ఎన్హెచ్ఆర్సీ జోక్యం చేసుకోవాలని కోరారు.
బంద్‌కు తెలంగాణ ఆటో, ట్యాక్సీ డ్రైవర్ల ఐకాస మద్దతు ప్రకటించింది. ఆటోలు, ట్యాక్సీలు తిప్పబోమని నాయకులు హైదరాబాద్‌లో వెల్లడించారు.