ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించండి...! అంటూ ప్రకటనలు ఇస్తున్న రాష్ట్ర ప్రజా రవాణ సంస్థ.... ప్రయాణికులకు తగినన్ని బస్సులను మాత్రం అందుబాటులో ఉంచలేకపోతోంది. ఎప్పుడో కొన్న బస్సులు.... ఎప్పుడు ఎక్కడ ఆగుతాయో తెలియదు. రాష్ట్రవ్యాప్తంగా 97 డిపోల్లో 6 వేల 450 బస్సులు నడుస్తున్నాయి. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత..... ఆర్టీసీ పెద్దగా కొత్త బస్సులను కొనుగోలు చేయలేదు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కొవిడ్‌కు ముందు 3 వేల 800 బస్సులు ఉండగా... ప్రస్తుతం 2వేల800కు కుదించారు. కొన్ని బస్సులను కార్గోగా మారిస్తే.. మరికొన్నింటికి కాలం చెల్లింది. హైదరాబాద్ జనాభా రోజురోజుకూ పెరిగిపోతుంటే అందుకు అనుగుణంగా బస్సులను పెంచాల్సిన ఆర్టీసీ..... వాటిని తగ్గిస్తూ వెళ్తోంది. మూడేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా చిన్నాపెద్దవి కలిపి 1700ల పైచిలుకు బస్సులు.... ప్రమాదాల బారిన పడ్డట్లు కార్మిక నేతలు చెబుతున్నారు.
ఆర్టీసీ నిబంధనల ప్రకారం జీవితకాలం పూర్తైన తర్వాత కొత్త బస్సును ఏర్పాటు చేయాలి. నాలుగేళ్ల నుంచి స్క్రాప్ చేయాల్సిన బస్సులు...., వాటికి కావాల్సిన నిధులకు సంబంధించిన అంశాలపై ఆర్టీసీ ముందుగానే అంచనావేసింది. 2019లో ఆర్టీసీ సమ్మె సందర్భంగా వేసిన లెక్కల ప్రకారం...2022 నాటికి 5వేల 153 బస్సులను స్క్రాప్ చేయాల్సి ఉంది. వాటి స్థానంలో కొత్త బస్సులను కొనుగోలు చేసేందుకు 1,545.9 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఐతే అంచనాలు అంచనాలుగానే ఉన్నాయి. ఇప్పటి వరకు బస్సుల కొనుగోలు కార్యరూపం దాల్చలేదు.
ప్రస్తుతం వెయ్యి 16 బస్సులు కొనుగోలు చేయాలని ఆర్టీసీ సన్నాహాలు చేస్తోంది. కొత్తగా కొనుగోలు చేసే బస్సులను దూర ప్రాంతాలకు నడపాలని భావిస్తోంది. పెరిగిన డీజీల్ ధరలను దృష్టిలో పెట్టుకుని..... కొన్ని ఈవీ బస్సులను కూడా కొనుగోలు చేయాలని చూస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఓలెక్ర్టా కంపెనీతో కలిసి ఆర్టీసీ 44 ఎలక్ర్టిక్ ఏసీ బస్సులను శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ మార్గంలో నడుపుతోంది. వాటికి అదనంగా మరికొన్ని ఈవీ వాహనాలను ఆర్టీసీ అందుబాటులోకి తీసుకురాబోతుంది.
కొత్త బస్సులను కొనుగోలు చేస్తే.... కొంతలో కొంత ఆదాయం సమకూరే అవకాశం ఉంటుందని యాజమాన్యం అంచనావేస్తుంది. పాత బస్సుల స్థానంలో కొత్త బస్సులు వస్తే..ప్రయాణికుల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతుందని భావిస్తోంది.
ఇదీ చూడండి: