తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె నేటితో 6వ రోజుకు చేరింది. సమ్మె రోజురోజుకు మరింత ఉద్ధృతమవుతోంది. కార్మికులు తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ నిరసనల ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో కార్మికులు ర్యాలీలతోపాటు డిపోల ఎదుట బైఠాయించి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు.
సమ్మెకు మద్దతు తెలిపిన భాజపా నాయకులు
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఆర్టీసీ కార్మికుల సమ్మెకు భాజపా నాయకులు మద్దతు తెలిపారు. ఆర్టీసీ ఐకాస నాయకులు, కార్మికులు, భాజపా నాయకులు డిపో నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఇబ్రహీంపట్నం తహసీల్దార్ వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందజేశారు.
ఫరూక్నగర్ డిపో ఎదుట...
హైదరాబాద్ పాతబస్తీ ఫరూక్ నగర్ డిపో ముందు ఆర్టీసీ ఉద్యోగులు బైఠాయించి తమ డిమాండ్లను వెంటనే ఒప్పుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డిపో ముందు ఎలాంటి నిరసనలు చేపట్టకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
కంటోన్మెంట్ డిపో ఎదుట...
సికింద్రాబాద్ జేబీఎస్ వద్ద ఉన్న కంటోన్మెంట్ డిపో ఎదుట ఆర్టీసీ కార్మికులు, యూనియన్ నాయకులు కలిసి ర్యాలీ నిర్వహించారు. డిపో ఎదుట బైఠాయించి వెంటనే కార్మికుల డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని... లేనిపక్షంలో ఆందోళనలు మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
మద్దతుగా వామపక్ష నాయకులు
మేడ్చల్ జిల్లా కుషాయిగూడ డిపో నుంచి ఈసీఐఎల్ వరకు ఆర్టీసీ కార్మికులు ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో భాజపా, సీపీఎం, సీపీఐ నాయకులు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ముషీరాబాద్‌లో కార్మికుల నిరసన ప్రదర్శన
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ముషీరాబాద్‌లో ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో కార్మికులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. విద్యానగర్ సోనీ ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయం నుంచి హిమాయత్ నగర్ తహసీల్దార్ కార్యాలయం వరకూ ర్యాలీ చేపట్టారు. "సంస్థలను ప్రైవేటీకరిస్తే ఊరుకునేది లేదని... జీతాల కోసం కాదు సంస్థ కోసం.." అంటూ నినాదాలు చేస్తూ ముందుకు సాగారు.
ఇవీ చూడండి: ఆర్టీసీ సమ్మెపై విచారణ ఈనెల 15కు వాయిదా