ఆర్టీసీలోని వివిధ విభాగాల్లో పని చేస్తున్న పొరుగుసేవల (అవుట్‌సోర్సింగ్) సిబ్బందికి మంగళం పలకాలని సంస్థ నిర్ణయించింది. ఆ స్థానంలో అదనంగా ఉన్న డ్రైవర్లు, కండక్టర్లను వినియోగించుకోవాలని ఆదేశిస్తూ ఆర్టీసీ ఎండీ సునీల్‌శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. సెక్యూరిటీ గార్డులు మొదలుకొని టైపిస్టులు, పెట్రోలు పంపుల్లో పనిచేసేవారు, పార్కింగ్ డ్రైవర్లు, బస్‌స్టేషన్లలో విచారణాధికారులు, ఆసుపత్రులు, డిస్పెన్సరీల్లో పారామెడికల్ ఇలా పలు విభాగాల్లో పొరుగుసేవల ప్రాతిపదికన పెద్ద సంఖ్యలో సిబ్బంది పని చేస్తున్నారు. వారందరి స్థానంలో ఇక నుంచి ఆర్టీసీ సిబ్బందినే నియమించాలని నిర్ణయించింది.
ఇటీవల ఆర్టీసీలో బాడుగ (లీజు) ప్రాతిపదికన బస్సులు తీసుకోవటం, పలు సర్వీసులను హేతుబద్ధీకరించటం ద్వారా కొంతమంది డ్రైవర్లు, కండక్టర్లకు విధులు లేకుండా పోయాయి. ఇలా మిగిలిన సిబ్బందిని పొరుగుసేవల సిబ్బంది స్థానంలో వినియోగించుకోవాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. అందుకోసం ప్రతి డిపో స్థాయిలో పొరుగుసేవల పద్ధతిన ఎంత మంది పని చేస్తున్నారు? బాడుగ బస్సుల కారణంగా ఎంతమంది డ్రైవర్లు, కండక్టర్లు అదనంగా ఉన్నారు? తదితర జాబితాలను సిద్ధం చేయాలని ఆర్టీసీ క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించింది.