తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-4 ఫలితాలు ఎట్టకేలకు విడుదలయ్యాయి. వివిధ శాఖల్లోని 1,554 ఉద్యోగాల నియామక ప్రక్రియ పూర్తయిందని టీఎస్పీఎస్సీ వెల్లడించింది. అర్హులు లేకపోవడం, కోర్టు కేసుల కారణంగా మరో 41 పోస్టులను భర్తీ చేయలేదని కమిషన్ కార్యదర్శి వాణిప్రసాద్ తెలిపారు.
రెవెన్యూ, పంచాయతీరాజ్, వాణిజ్య పన్నులు, హోం, అగ్నిమాపక శాఖ, ఎస్సీ అభివృద్ధి, అటవీ, వైద్యారోగ్య, రిజిస్ట్రేషన్లు తదితర 11 ప్రభుత్వ విభాగాల్లో 1,595 గ్రూప్-4 ఉద్యోగాల భర్తీ కోసం 2018 జూన్ 2న టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీచేసింది. వీటితో పాటు జీహెచ్ఎంసీ బిల్ కలెక్టర్, ఆర్టీసీ, బెవరేజెస్ విభాగాల్లో మరో 313 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది.
రెండేళ్ల క్రితమే పరీక్షలు..
ఉద్యోగాల కోసం రాష్ట్రంలో 3 లక్షల 12 వేల 397 మంది దరఖాస్తు చేసుకున్నారు. రెండేళ్ల క్రితం అక్టోబరు 7న రాత పరీక్ష నిర్వహించారు. ఆర్టీసీ, జీహెచ్ఎంసీ, బెవరేజెస్ ఉద్యోగ నియామక ఫలితాలు ప్రకటించారు. వివిధ కారణాలతో గ్రూప్ 4 ఫలితాల విడుదలలో జాప్యం చోటుచేసుకొంది.
తెలుగు స్టెనో.. అర్హులు కరవు
వివిధ శాఖల్లో 1,098 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల్లో.. 1,090 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేశారు. 450 టైపిస్టు ఉద్యోగాల్లో 425 ఖాళీలను భర్తీ చేశారు. 44 ఇంగ్లిష్ స్టెనోఉద్యోగాల్లో 39కి అభ్యర్థులను ఎంపిక చేసినట్లు కమిషన్ తెలిపింది. మూడు తెలుగు స్టెనో పోస్టుల భర్తీకి ప్రక్రియ చేపట్టినా.. అర్హులు లేక వాటిని ఖాళీగా వదిలినట్లు వాణీ ప్రసాద్ తెలిపారు.
రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటైన నుంచి ఇప్పటి వరకు వివిధ విభాగాలకు చెందిన 30,723 ఉద్యోగాలను భర్తీ చేసినట్లు కమిషన్ కార్యదర్శి వాణిప్రసాద్ వెల్లడించారు.
ఇవీచూడండిః ఎంసెట్ ఇంజినీరింగ్ ఫలితాలు విడుదల