హైదరాబాద్‌లోని పారిశ్రామికవాడల్లోని పరిశ్రమలకు జారీచేసిన నోటీసులు వెనక్కి తీసుకొని చట్టం ప్రకారం తాజాగా జారీచేస్తారో లేదో చెప్పాలని జీహెచ్ఎంసీని హైకోర్టు ఆదేశించింది. కాలుష్య పరిశ్రమలు నిబంధనలు ఉల్లంఘించాయని బల్దియా, కాలుష్య నియంత్రణ మండలి నోటీసులను సవాల్‌చేస్తూ దాఖలైన సుమారు 700కుపైగా కేసులు.. తమ ముందున్నట్లు పేర్కొంది.
ప్రస్తుత పరిస్ధితుల్లో వాటిని విచారించి తేల్చడం కష్టసాధ్యమన్న హైకోర్టు.. ఆ నోటీసుల్లో ఎక్కువశాతం నిబంధనలకు అనుగుణంగా లేవని పేర్కొంది. అందువల్ల ఇప్పటికే జారీ చేసిన నోటీసులను ఉపసహరించుకుని చట్ట నిబంధనల ప్రకారం నోటీసులు జారీ చేసే అంశాన్ని పరిశీలించాలని సూచించింది. లేదంటే తామే నిర్ణయాన్ని వెలువరించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
జీహెచ్ఎంసీ, పీసీబీ నోటీసులను సవాలు చేస్తూ దాఖలైన సుమారు 22 పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహన్, జస్టిస్ విజయ్‌సేన్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. శాస్త్రీనగర్, టాటానగర్ పారిశ్రామిక వాడలుగా ఉన్నట్లు పిటిషనర్లు చెబుతున్నారని... అవి నివాస ప్రాంతాలని అధికారులు అంటున్నారని... వాటిలో వాస్తవం తెలిసేందుకు జోనల్‌ప్లాన్ సమర్పించాలని ఆదేశించింది. వివిధ నిబంధనల కింద జారీ చేసిన నోటీసులను ఉపసంహరించుకుని... తాజాగా నోటీసులు జారీ చేస్తే వివరణ ఇవ్వడానికి అవకాశం ఉంటుందని పేర్కొంది.
ఇదీ చూడండి: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా ఉద్ధృతం