HC Comments On New Year celebrations: నూతన సంవత్సర వేడుకల్లో పాటించాల్సిన ఆంక్షలను ఉల్లంఘించిన వారిపై తీసుకునే చర్యలను నివేదించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కరోనా నియంత్రణ కోసం కేంద్రం ప్రభుత్వం ఎప్పటికప్పుడు జారీ చేస్తున్న మార్గదర్శకాలను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. వేడుకలను నియంత్రించేలా జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్రశర్మ, జస్టిస్ తుకారాంజీ ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది.
పరిస్థితుల ఆధారంగా నిర్ణయం..
కొత్త సంవత్సర సంబరాలను నియంత్రించాలన్న కోర్టు ఆదేశాలను ప్రభుత్వం అమలు చేయడం లేదని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు తెలిపారు. మరోవైపు పబ్బులు, బార్లలో వేడుకల సమయాన్ని మరింత పెంచిందని హైకోర్టుకు వివరించారు. దిల్లీ, మహారాష్ట్ర తరహా ఆంక్షలను అమలు చేయాలని పిటిషనర్లు ధర్మాసనాన్ని కోరారు. నూతన సంవత్సరం వేడుకల నియంత్రణలో జోక్యానికి హైకోర్టు నిరాకరించింది. వివిధ రాష్ట్రాల్లో భిన్నమైన పరిస్థితులు ఉంటాయని.. అక్కడి పరిస్థితుల ఆధారంగా ఆయా రాష్ట్రాలు నిర్ణయం తీసుకుంటాయని వ్యాఖ్యానించింది.
నివేదిక సమర్పించాలి..
రాష్ట్రంలో కొవిడ్ టీకా మొదటి డోస్ వంద శాతం పూర్తయిందని.. రెండో డోసు కూడా 66శాతం దాటిందని హైకోర్టు ప్రస్తావించింది. అయితే కరోనా వ్యాప్తి నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు జారీ చేస్తున్న మార్గదర్శకాలను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. నూతన సంవత్సర వేడుకలపై పలు ఆంక్షలు విధిస్తూ పోలీసులు ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేశారని హైకోర్టు గుర్తుచేసింది. ఆంక్షలు ఉల్లంఘించిన వారిపై తీసుకున్న చర్యలను వివరిస్తూ తదుపరి విచారణలో నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. విచారణను జనవరి 4వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది.
ఇదీ చూడండి: