రాయలసీమ ఎత్తిపోతల పథకం కేసు సుప్రీంకోర్టు, ఎన్జీటీలో పెండింగ్‌లో ఉంటే తామెలా జోక్యం చేసుకుంటామని హైకోర్టు ప్రశ్నించింది. తెలంగాణ హైకోర్టుకు విచారణ పరిధి ఉంటుందని అదనఫు ఏజీ వాదించారు. సుప్రీంలో నదీజలాల కేటాయింపు అంశం ఉందని పేర్కొన్నారు. అనుమతి లేకుండా ఏపీ ప్రభుత్వం పనులు చేపడుతోందని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఏపీ ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ఎలా ఆదేశించగలదని ధర్మాసనం ప్రశ్నించింది. కాంగ్రెస్ నేత వంశీచంద్‌రెడ్డి, సామాజిక కార్యకర్త శ్రీనివాస్ దాఖలు చేసిన వ్యాజ్యంపై ఈ విచారణ జరిగింది.
టెండర్లకు వెళ్లేందుకు ఏపీకి ఎన్‌జీటీ అనుమతి ఇచ్చిందని పిటిషనర్ తరఫు న్యాయవాది తెలిపారు. ఎన్‌జీటీ ఉత్తర్వులపై సుప్రీంకోర్టుకు ఎందుకు వెళ్లలేదని హైకోర్టు ప్రశ్నించింది. ఎన్‌జీటీకి విచారణ పరిధి లేదని ఏజీ వాదించారు. పిటిషన్‌లోని అంశాలన్నీ సుప్రీంకోర్టు ముందున్నాయని ఉన్నత న్యాయస్థానం దృష్టికి ఏపీ ఏజీ శ్రీరాం తీసుకెళ్లారు. సుప్రీంలో విచారణ పూర్తయ్యే వరకు ఆగాలని కోరారు. సుప్రీంకోర్టులో విచారణ పూర్తయ్యే వరకు కేసును హైకోర్టు నిరవధిక వాయిదా వేసింది. అక్కడ తేలాక తమ దృష్టికి తేవచ్చని పిటిషనర్లకు సూచించింది.