నాణ్యమైన ఆహారోత్పత్తుల రంగంలో శ్రద్ధ పెడితే భారత్ అగ్రస్థానంలో నిలిచే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. త్వరలో స్పెయిన్, ఇజ్రాయిల్, న్యూజిలాండ్ సందర్శించి వ్యవసాయ పంటల సాగుపై అధ్యయనం చేయనున్నట్లు ప్రకటించారు.
మూడు రోజుల కర్ణాటక పర్యటనలో భాగంగా నిరంజన్‌రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ఉద్యాన ప్రతినిధుల బృందం బెంగళూరును సందర్శించింది. హెసరగట్ట ఐకార్ - ఐఐహెచ్ఆర్ పరిశోధనా కేంద్రం డైరెర్టర్ దినేష్, వివిధ విభాగాల ముఖ్య శాస్త్రవేత్తలతో మంత్రి ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యాన శాఖ సంచాలకులు లోక వెంకటరామిరెడ్డి, కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ నీరజా ప్రభాకర్ పాల్గొన్నారు.
తెలంగాణ, కర్ణాటకల నేలలు, వాతావరణ పరిస్థితులు దాదాపు సమానంగా ఉన్న దృష్ట్యా ఉద్యాన పంటల సాగులో పరస్పర సహకారం అవసరమని మంత్రి నిరంజన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. తెలంగాణలో ఆలుగడ్డ సాగు పెంచాలని నిర్ణయించామని.. అందుకు సహకారం కావాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణలో రైతుబంధు, రైతు బీమా, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ వంటి పథకాలు సహా సకాలంలో రసాయనాలు, ఎరువులు, రాయితీ విత్తనాలు అందుబాటులో ఉంచి.. రైతులకు భరోసానిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి, కొత్త ప్రాజెక్టులతో సాగు నీటి లభ్యత పెరిగిందని.. తద్వారా రైతుల్లో ఆత్మవిశ్వాసం పెరిగిందని చెప్పారు.
ఔషధ, సుగంధ పంటలకు మార్కెట్లో ఆదరణ ఉన్నందున ఆ దిశగా పరిశోధనలు జరగాలని నిరంజన్‌రెడ్డి సూచించారు. ఉల్లి విత్పనోత్పత్తిపై దృష్టి సారించాలని కోరారు. ఐఐహెచ్ఆర్ పరిశోధనా కేంద్రంలో.. బీర, చిక్కుడు, క్యారెట్, మిరప, టమాటా, ముల్లంగి పంటల సాగును మంత్రి నేతృత్వంలోని బృందం పరిశీలించింది. సంచార కూరగాయల విక్రయ వాహనాలను సందర్శించింది.
ఇవీచూడండి: మల్లన్నసాగర్‌పై సాంకేతిక కమిటీ ఏర్పాటు