TRUEUP CHARGES BURDEN : విద్యుత్ వినియోగదారులపై మరో భారం పడబోతుంది. ట్రూఅప్ చార్జీల పేరిట విద్యుత్ శాఖ వడ్డనకు సిద్దమవుతోంది. నష్టాల్లో ఉన్న విద్యుత్ పంపిణీ సంస్థలను గట్టెక్కించాలంటే ట్రూఅప్ చార్జీలు వసూలు చేయడమే శరణ్యమని డిస్కంలు భావిస్తున్నాయి. అందుకే వినియోగదారుల నుంచి ట్రూఅప్ చార్జీలు వసూలు చేసుకునే వెసులుబాటు కల్పించాలని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలికి డిస్కంలు ఇటీవలే విజ్ఞప్తి చేశాయి. ట్రూఅప్ చార్జీలపై ఈఆర్సీ బహిరంగ విచారణ జరిపి తుది నిర్ణయం తీసుకోనుంది. ట్రూఅప్ చార్జీలతో భారీగా భారం పడుతుందని వినియోగదారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. డిస్కంలు ఈ నిర్ణయాన్ని విరమించుకోవాలని వినియోగదారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
2006–07 నుంచి 2020–21 మధ్య చేసిన విద్యుత్ సరఫరా, వసూలైన బిల్లుల్లో తేడాలకు సంబంధించి రూ.4,092 కోట్ల లోటు ఉంటుందని డిస్కంలు భావిస్తున్నాయని ఈఆర్సీ ఛైర్మన్ శ్రీరంగారావు తెలిపారు. ఆ వ్యత్యాసం తగ్గాలంటే ట్రూఅప్ చార్జీల వసూలు చేసుకునేందుకు అంగీకరించాలని డిస్కంలు ఇటీవలే ప్రతిపాదనలు సమర్పించాయని చెప్పారు. దక్షిణ తెలంగాణ జిల్లాల్లో వినియోగదారులకు విద్యుత్ సరఫరా చేసే ఎస్పీడీసీఎల్ రూ.3,259 కోట్ల మేర ట్రూఅప్ చార్జీల వసూలుకు అనుమతి కోరిందని ఆయన పేర్కొన్నారు.
ఉత్తర తెలంగాణ జిల్లాలకు విద్యుత్ సరఫరా చేసే ఎన్పీడీసీఎల్ మరో రూ.833.23 కోట్ల ట్రూఅప్ చార్జీల వసూలు కోసం ప్రతిపాదన సమర్పించిందని అన్నారు. సెప్టెంబర్ 8వ తేదీలోగా ఈ ప్రతిపాదనలపై అభ్యంతరాలు, సలహాలు, సూచనలను తెలపాలని రెండు డిస్కంలు ఇటీవల బహిరంగ ప్రకటన విడుదల చేశాయన్నారు. ఆయా అభ్యంతరాలకు రాతపూర్వకంగా వివరణ ఇస్తాయని ఈఆర్సీ ఛైర్మన్ తెలిపారు. తర్వాత ఈఆర్సీ బహిరంగ విచారణ జరిపి మరోసారి అభిప్రాయ సేకరణ చేస్తుందన్నారు. అనంతరం ప్రతిపాదిత ట్రూఅప్ చార్జీల్లో ఎంతమేర వసూలు చేయాలి? ఎలా వసూలు చేయాలన్న అంశాలను నిర్ణయిస్తూ ఈఆర్సీ ఉత్తర్వులు జారీ చేసి, ఆ మేరకు డిస్కంలు చార్జీలను వసూలు చేసుకుంటాయని ఆయన తెలిపారు.
ఈ ప్రతిపాదనలు అమల్లోకి వస్తే వినియోగదారులపై మరింత భారంపడే అవకాశం ఉందని ఇప్పటికే విద్యుత్ చార్జీలను పెంచిన డిస్కంలు ఇప్పుడు ట్రూఅప్ చార్జీలు పెంచితే అది భరించలేమని పేద, మధ్యతరగతి ప్రజలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ట్రూఅప్ చార్జీల వసూలు ఆలోచనను డిస్కంలు విరమించుకోవాలని కోరుతున్నారు.