కాంగ్రెస్ నాయకుల ఆరోపణలను రాష్ట్ర, జిల్లా స్థాయి తెరాస నాయకులు ఎక్కడికక్కడ తిప్పికొట్టాలని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సూచించారు. భాజపాను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని తెలంగాణ భవన్‌లో జరిగిన పార్టీ ప్రధాన కార్యదర్శుల భేటీలో కేటీఆర్ తెలిపారు. తెరాస జిల్లా కమిటీలకు త్వరలో సమన్వయకర్తలను నియమించనున్నట్లు కేటీఆర్ చెప్పారు. గ్రామ, మండల, వార్డు స్థాయి కమిటీల ఏర్పాటు పూర్తయిందన.. జిల్లా స్థాయి కమిటీలకు నేతృత్వం వహించేందుకు సమన్వయకర్తలను నియమించనున్నట్లు మున్సిపాల్టీల్లో కూడా త్వరలో పార్టీ కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు.
అప్రమత్తంగా ఉండాలి
జిల్లా పార్టీ కార్యాలయాల నిర్మాణం త్వరలో పూర్తయ్యేలా చూడాలని కేటీఆర్ చెప్పారు. పార్టీ ప్రధాన కార్యదర్శులు వెళ్లి నిర్మాణాలను పర్యవేక్షించాలని తెలిపారు. ఈనెల 15 నాటికి కొన్నింటిని సిద్ధం చేయగలిగితే... ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ప్రారంభిస్తారని కేటీఆర్ పేర్కొన్నారు. కరోనా పరిస్థితుల్లో పార్టీ యంత్రాంగం నిర్లక్ష్యంగా ఉండకూడదని... అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. కరోనా బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుంటూ.. ప్రజలతో సంబంధాలు కొనసాగించాలన్నారు.
ప్లాస్మా దాతలను ప్రోత్సహించాలి
కరోనా కారణంగా ప్రజలు ఎలాంటి ఇబ్బంది పడినా.. పార్టీ శ్రేణులు వెంటనే స్పందించి అండగా ఉండాలని చెప్పారు. ప్లాస్మా దాతలను ప్రోత్సహించేలా తెరాస నేతలు కృషి చేయాలన్నారు. కరోనా పరిస్థితుల కారణంగా పార్టీ కార్యకర్తల శిక్షణను వాయిదా వేసినట్లు కేటీఆర్ చెప్పారు.
ఇదీ చదవండి: దేశంలో ఏ పార్టీకి లేని పటిష్ఠమైన యంత్రాంగం తెరాసకు ఉంది: కేటీఆర్