తెరాస సభ్యత్వ నమోదును ఈనెల 31 వరకు పూర్తి చేయాలని పార్టీ ప్రధాన కార్యదర్శులకు కేటీఆర్ స్పష్టం చేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శులతో ప్రగతిభవన్‌లోని క్యాంపు కార్యాలయంలో కేటీఆర్ సమావేశమయ్యారు. పార్టీ సభ్యత్వ నమోదుపై నియోజకవర్గాల వారీగా సమీక్షించారు. తెరాస సభ్యత్వం సుమారు 65 వేలకు చేరడంపై కేటీఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు. హైదరాబాద్ పాతబస్తీతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో కొంచెం కష్టపడితే మరింత పెరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
కార్యకర్తల ప్రమాద బీమా ఈనెలాఖరుతో ముగుస్తున్నందున.. ఆగస్టు 1 నుంచి కొత్త సభ్యత్వాల ప్రకారం బీమా కల్పించాలని సమావేశంలో నిర్ణయించారు. ఆగస్టు 1న బీమా కంపెనీకి ప్రీమియం చెల్లించేలా కార్యచరణ రూపొందించారు. ఇప్పటి వరకు సమారు 50 వేల సభ్యత్వాల డిజిటలీకరణ పూర్తయిందని.. ఈనెలాఖరులోపే మిగతావి పూర్తి చేయాలని కేటీఆర్ స్పష్టం చేశారు. ఆగస్టు 1న మరోసారి సమావేశం నిర్వహించుకుందామని పార్టీ ప్రధాన కార్యదర్శులకు కేటీఆర్ తెలిపారు. జిల్లా, రాష్ట్ర కమిటీల ఏర్పాటు, జిల్లా కార్యాలయాల నిర్మాణంపై తదితర అంశాలపై ఆరోజున సమగ్రంగా చర్చించుకోవచ్చునని ప్రధాన కార్యదర్శులకు కేటీఆర్ తెలిపారు.
ఇదీచూడండి: VENKAIAH NAIDU: 'రామప్పకు యునెస్కో గుర్తింపు లభించడం దేశానికే గర్వకారణం'